ఐడీబీఐ మోసం కేసు: శివ గ్రూప్ కంపెనీల రూ.224 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

ఐడీబీఐ మోసం కేసు: శివ గ్రూప్ కంపెనీల రూ.224 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

ఎయిర్ సెల్ మాజీ ప్రమోటర్ సి శివశంకరన్ కి చెందిన శివ గ్రూప్ కంపెనీల రూ.224.6 కోట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అటాచ్ చేసింది. ఐడిబిఐ బ్యాంక్ నుంచి అనేక కోట్లు రుణం తీసుకొని మనీ లాండరింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ చర్య తీసుకొంది. శివ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, కరీబియన్ దీవుల్లోని బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ లో ఉన్న యాక్సెల్ సన్ షైన్ లిమిటెడ్ పై  మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆస్తులు అటాచ్ చేస్తున్నట్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈడీ తెలిపింది.

చెన్నైలోని ఎంఆర్సీ నగర్, టీ నగర్ లలో ఉన్న ఆఫీసులు, భూములు, బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, అనేక ఇతర ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఈ ఆస్తుల మొత్తం విలువ సుమారుగా రూ.224.6 కోట్లు ఉంటాయని చెప్పింది. కంపెనీలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిపింది. చెన్నైలోని ఒక ఐడీబిఐ బ్యాంక్ శాఖ నుంచి దాదాపుగా రూ.470 కోట్ల రుణం తీసుకొని చెల్లించలేదని సి. శివశంకరన్, ఇతరులపై అభియోగాలు నమోదు చేసింది.

శివ గ్రూప్ కంపెనీలన్నీ నిరర్థక ఆస్తులుగా మారడంతో యాక్సెల్ సన్ షైన్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రుణం పొంది తమ పాత అప్పులు, ఇతర రుణాలను చెల్లించేందుకు ఉపయోగించినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. కొత్తగా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేదని గుర్తించింది. శివశంకరన్ కంపెనీలకు రూ.322 కోట్లు, రూ. 523 కోట్లు రుణాలుగా ఇచ్చిన ఈ కేసులో చివరికి ఆ రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయి.