2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పవన్‌

2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పవన్‌

ప్రజాసేవే జనసేన సిద్ధాంతమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. మిగతాపార్టీల్లాగా తమది 'దోపిడీ సిద్ధాంతం' కాదని చెప్పారు. పోరాట యాత్రలో భాగంగా ఇవాళ కపాసకుద్ది వద్ద సముద్ర తీరంలో గంగ పూజ అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. మత్స్యకారుల సమస్యలు, గిరిజనుల సమస్యలపై తనకు అవగాహన ఉన్నదని, ఐతే అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకోవడానికే ఈ యాత్ర చేపట్టానని చెప్పారు. వెనుకబడిన శ్రీకాకుళం ప్రాంతాన్ని పార్టీలన్నీ వదిలేశాయని, అందుకే తాను ఇక్కడి నుంచే యాత్రకు శ్రీకారం చుట్టానన్నారు. తానెప్పుడూ పదవులు కోరుకోలేదని, పనిచేయడానికే ఇష్టపడతానని అన్నారు. మిగతా పార్టీల మాదిరిగా కులాలను విడదీయబోమని, సమష్టిగా పనిచేస్తామని చెప్పారు. యువత, ఆడపడుచుల మద్దతు.. పెద్దల ఆశీసులుంటే 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తాను అంతర్జాతీయ సంస్థల నిపుణులతో  మాట్లాడినా ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కితగ్గిందని అన్నారు. ఈ యాత్రలో ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుంటానని, మలి విడత పర్యటనలో ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పవన్‌ చెప్పారు.