కన్నవారిని గాలికొదిలేస్తే... ఇక జైలే...

కన్నవారిని గాలికొదిలేస్తే... ఇక జైలే...

తల్లిదండ్రులను వారి పిల్లలు వార్థక్యంలో సరిగ్గా చూసుకోనట్లుయితే ఆరు నెలలు ఊచలు లెక్కించాల్సిందే. ఇందుకు సంబంధించిన చట్టాన్ని తీవ్రంగా ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఇందుకు తగిన శిక్ష  మూడు నెలలే ఉండగా దాన్ని ఆరు నెలలకు పొడిగించింది. తల్లిదండ్రులను విస్మరించినా.. వేధింపులకు గురిచేసినా.. ఆస్తి కోసం ఒత్తిళ్లు తెచ్చినా ఇక జైలుపాలు కావడం చాలా ఈజీ. 2007లోని సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ చట్టాన్ని సమీక్షిస్తున్న సామాజిక న్యాయం, సాధికారికత శాఖ 'పిల్లలు' అన్న పదానికి ఉన్న నిర్వచనాన్ని కూడా విస్తృతం చేయనుంది. ఇన్నాళ్లూ పిల్లలు అంటే వారికి పుట్టిన సంతానం లేదా మనవలు, మనవరాళ్లు అని ఉంది. ఇప్పుడు.. పిల్లలు అంటే కూతుళ్లు, అల్లుళ్లు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, ఆ తలిదండ్రులు దత్తత తీసుకున్న పిల్లలు, సవతి పిల్లలు.. ఇలా అందరూ వచ్చేట్టుగా విస్తరించనుంది. చివరికి మైనర్‌ పిల్లలని కూడా ఈ కొత్త బిల్లులో చేర్చి చాలా పటిష్టంగా రూపొందించింది.

'తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ ముసాయిగా బిల్లు-2018' గా తెస్తున్న ఈ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. తల్లిదండ్రుల సంరక్షణకు నెలవారీగా ఇవ్వాల్సిన కనీస మొత్తం ఇప్పుడున్న 10వేలను ఎత్తివేస్తున్నారు. ఇది వారి వారి కుటుంబాలను బట్టి, ఆదాయ వ్యయాల బట్టి నిర్ణయిస్తారు. సంరక్షణ అంటే కేవలం ఆహారం, బట్టలు, ఇల్లు, వైద్య ఖర్చులు భరించడమే కాదు ఆ తల్లిదండ్రుల క్షేమం, భద్రతను ఆ పిల్లలు చూడాలి. సంరక్షణ కింద ఇవ్వాల్సిన నెలవారీ సొమ్మును పిల్లలు ఇవ్వకపోతే ఆ తలిదండ్రులు మెయిన్‌టెనెన్స్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. ఇలాంటివి అన్ని చేర్చి పటిష్టంగా కేంద్రం బిల్లును రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.