19న 'ఐకియా' ప్రారంభం

19న 'ఐకియా' ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్‌ రిటైల్‌ కంపెనీ ఐకియా... హైదరాబాద్‌ తరలివచ్చింది... ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లో విక్రయ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. స్వీడన్‌కు చెందిన ఐకియాకు భారత్‌లో ఇదే తొలి విక్రయ కేంద్రం కావడం... అది కూడా హైదరాబాద్‌లో ప్రారంభంకానుండడం మరో విశేషం. దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడులతో ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు ఐకియా ఇండియా సీఈవో పీటర్‌ బెట్‌జెల్‌ వెల్లడించారు. ఈ విక్రయ కేంద్రంలో కుర్చీలు, సోఫాల నుంచి లంచ్‌ బాక్సుల వరకూ దాదాపు 7,500 రకాల ఉత్పత్తులను విక్రయించనున్నారు. 4 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఉన్న ఈ కేంద్రంలో వెయ్యిమందికి పైగా ఉద్యోగులు పని చేస్తారని,  ఇందులో సగానికిపైగా మహిళలే ఉంటారని నిర్వాహకులు తెలిపారు. 

ఐకియా ఇంటర్నేషనల్ ఫార్ములాకు అనుగుణంగా వర్కర్ల నుంచి మేనేజర్ల స్థాయి వరకు 50 శాతం మంది మహిళలే ఉన్నారని, వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయనున్నామని వెల్లడించారు. ఇక ఈ కేంద్రంలో విక్రయించే ఉత్పత్తుల్లో దాదాపు 1,000 పైగా ఉత్పత్తుల ధర రూ.200 కంటే తక్కువగా ఉండబోతున్నాయి. మరోవైపు ఇక్కడ విక్రయించే వస్తువుల్లో ప్రారంభంలో 20 శాతం వరకూ స్థానికంగా కొనుగోలు చేసిన వస్తువులు ఉండనుండగా... భవిష్యత్తులో వీటిని 50 శాతానికి పెంచాలన్నది టార్గెట్‌గా పెట్టుకున్నారు. హోం డెలివరీ సర్వీసును కూడా ప్రారంభించనున్నారు. కొన్ని ఎంపిక చేసుకున్న వస్తువులను ఇంటి వద్దకు వచ్చి అసెంబ్లింగ్‌ చేస్తారు. దీనికోసం కొంత ఛార్జ్ వసూలు చేయనుండగా... 150 మంది వరకు సిబ్బందిని ఇందుకు వినియోగించనున్నారు. ఐకియా విక్రయ కేంద్రంలో రెస్టారెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటున్నారు నిర్వాహకులు. ప్రపంచ వ్యాప్తంగా ఐకియా విక్రయ కేంద్రాల్లో ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో 1,000 సీట్ల సామర్థ్యంతో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది ఐకియా.