బిగ్ డీల్‌: దేశంలో 14 కొత్త ఐమ్యాక్స్‌లు

బిగ్ డీల్‌: దేశంలో 14 కొత్త ఐమ్యాక్స్‌లు
భార‌త‌దేశంలో ఇప్ప‌టికే అన్ని మెట్రో న‌గ‌రాల్లో ఐమ్యాక్స్ థియేట‌ర్లు ప్రేక్ష‌కాభిమానుల‌కు వినోదం పంచుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్‌ను క‌లుపుకుని, మొత్తం 10 ఐమ్యాక్స్ థియేట‌ర్లు ఇప్ప‌టివ‌ర‌కూ అందుబాటులో ఉన్నాయి. ఐమ్యాక్స్‌.. ఆ ప‌దానికి త‌గ్గ‌ట్టే అత్యంత భారీ స్క్రీన్‌పై విజువ‌ల్ వండ‌ర్స్‌ని వీక్షించే సాంకేతిక‌ అవ‌కాశం ప్రేక్ష‌కుల‌కు నేడు అందుబాటులో ఉంది. అయితే మారుతున్న టెక్నాల‌జీతో పాటు అప్‌డేట్ అవ్వ‌క‌పోతే మ‌న దేశం వినోద‌రంగంలో వెన‌క‌బ‌డిపోవ‌డం ఖాయం. ఈ రంగంలో బిజినెస్ విస్త్ర‌తి అంత‌కంత‌కు పెరుగుతుందే కానీ, త‌గ్గడం లేద‌న్న‌ది ఓ స‌ర్వే. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్ర‌ధాన కార్పొరెట్లు అంత‌కంత‌కు ఐమ్యాక్స్ థియేట‌ర్ల‌ను విస్త‌రిస్తున్నాయి. అందుకోసం టైఅప్‌లు కుదుర్చుకుంటున్నాయి. ఆ కోవ‌లోనే లేటెస్టుగా ఐమ్యాక్స్ వ్య‌వ‌స్థ ప్ర‌తిష్ఠాత్మ‌క ఐనాక్స్ లెయిజ‌ర్ లిమిటెడ్‌, సినీపోలీస్ వంటి దిగ్గ‌జ సంస్థ‌ల‌తో ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఐనాక్స్‌తో క‌లిసి ఐదు ఐమ్యాక్స్‌లు, సినీపోలీస్ ఇండియాతో క‌లిసి 4 భారీ ఐమ్యాక్స్ థియేట‌ర్ల‌ను ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. మ‌రో ఐదు ఐమ్యాక్స్ క‌న్వ‌ర్ష‌న్ల‌కు సంబంధించి పీవీఆర్ సంస్థ‌తోనూ ఓ ఎంవోయూ కుదిరింది ఇదివ‌ర‌కూ ఫిబ్ర‌వ‌రిలో. మొత్తం 14 కొత్త ఐమ్యాక్స్‌ల రూప‌క‌ల్ప‌న‌కు స‌ర్వం రంగం సిద్ధ‌మైంది. అంటే ఈ ఏడాదిలోనే వినోదం విస్త్ర‌తి రెట్టింపు చేసేందుకు భారీగా స‌న్నాహాలు సాగుతున్నాయ‌నే దీన‌ర్థం.