వన్డేలకు తాహిర్‌ గుడ్‌బై...

వన్డేలకు తాహిర్‌ గుడ్‌బై...

మెగా టోర్నీ వరల్డ్‌ కప్‌ 2019 తర్వాత అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని దక్షిణాఫ్రికా సీనియర్ లెగ్ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (40) తెలిపారు. దక్షిణాఫ్రికా జట్టు తరువాతి తరం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే వరల్డ్‌ కప్‌ తర్వాత టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతానన్నారు. తాహిర్‌ కంటే ముందు వెస్టిండీస్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ వరల్డ్‌ కప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతానని ప్రకటించారు.

2011 ఫిబ్రవరి 24న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇమ్రాన్‌ తాహిర్‌ వన్డేల్లోకి ఆరంగేట్రం చేసారు. ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడి 156 వికెట్లు తీసారు. బ్యాటింగ్ లో 146 పరుగులు చేసారు. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తాహిర్‌ 45 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 7 వికెట్లు సాధించిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్‌గా తాహిర్‌ గుర్తింపు పొందాడు. దక్షిణాఫ్రికా తరపున వేగంగా 100 వికెట్లు (58 వన్డేల్లో) తీసిన బౌలర్‌గా కూడా గుర్తింపు సాధించాడు. దక్షిణాఫ్రికా తరపున తాహిర్‌ 2011, 2015 వన్డే వరల్డ్‌ కప్‌లలో.. 2014, 2016 టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడారు.