హాజరు 92%.. మాట్లాడింది 365 పదాలు

హాజరు 92%.. మాట్లాడింది 365 పదాలు

దూకుడైన తర్క శైలి, ప్రత్యర్ధుల ప్రశ్నలకు ధీటుగా జవాబులు ఇవ్వడానికి బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పెట్టింది పేరు. కానీ ఈ రాజకీయ భీష్ముడు తన ధోరణికి భిన్నంగా ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. ప్రస్తుత లోక్ సభలో సభ్యుడైన ఎల్ కె అద్వానీ ఈ ఐదేళ్లలో మాట్లాడింది చాలా తక్కువ. ఒకానొక సమయంలో బీజేపీలో ఫైర్ బ్రాండ్ అనే పదం వినపడగానే అద్వానీ మొహమే అందరికీ గుర్తొచ్చేంది. పార్లమెంటులోనే కాదు..పార్టీలో కూడా చర్చించాల్సిన అంశాలన్నీ ఆయన కనుసన్నలలోనే నిర్ణయించేవారు. కానీ 296 రోజులు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన హాజరు 92%గా ఉంది. కానీ సభలో మాట్లాడింది 365 మాటలు మాత్రమే.

బీజేపీ లోహ పురుషుడిగా ప్రసిద్ధికెక్కిన లాల్ కృష్ణ అద్వానీ, సభలో ఎంత గందరగోళం చెలరేగినప్పటికీ తన వాదనను సమర్థంగా వినిపించేవారు. 2012 ఆగస్ట్ 8న సభలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పటికీ అనేక మంది మెదళ్లలో నిలిచే ఉంది. అప్పుడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ సర్కార్ ని ధీటుగా ఎదుర్కొన్న బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష నేతగా అద్వానీ పలు ప్రభుత్వ నిర్ణయాలను నిలదీశారు. అస్సాంలో పెద్ద ఎత్తున చెలరేగిన జాతి హింస, అక్రమ చొరబాట్ల గురించి వాయిదా తీర్మానంపై చర్చ సాగుతోంది. సభలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. మన్మోహన్ ప్రభుత్వం వాయిదా తీర్మానాన్ని పడగొట్టాలని విశ్వప్రయత్నం చేసింది. కానీ అంత గందరగోళంలోనూ అద్వానీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రభుత్వాన్ని అదరగొట్టే విధంగా తన వాదనను వినిపించారు. ఆ ప్రసంగం సుమారు 5,000 మాటలని లోక్ సభ రికార్డులు చెబుతున్నాయి. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు.. చివరిదీ కాదు. ఇలా ఎన్నోమార్లు సభలో గందరగోళం నెలకొని ఉన్నప్పటికీ ఆయన తన అద్భుత తర్కంతో బలంగా వాదన వినిపించారు. 

కానీ గత ఐదేళ్లలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లాల్ కృష్ణ అద్వానీ పూర్తిగా మారిపోయారు. అధికార పార్టీ తరఫున ఆయన సభలో మొదటి వరుసలో కూర్చుంటున్నారు. కానీ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. గత నెల (జనవరి 8, 2019)లో సభలో భారీ హంగామా నెలకొంది. ఈ సమయంలో ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ పౌరసత్వం (సవరణ) బిల్లు ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా అద్వానీ సభలో ఉన్నారు. కానీ అంత కీలక బిల్లుపై కూడా ఆయన ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఎనిమిదేళ్ల క్రితం ఈ రాజకీయ కురువృద్ధుడు ఇదే విషయంపై ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ తన వాదనను ధాటిగా వినిపించారు. 2012 నుంచి 2019 వరకు మధ్య కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలు మారాయి. రాజకీయ వాతావరణం మారిపోయింది. అలాగే లాల్ కృష్ణ అద్వానీ కూడా మారిపోయారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

గత 5 ఏళ్లలో అద్వానీ 5 మార్లు లోక్ సభలో చర్చలో పాల్గొన్నారు. వాటిలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక రెండు సందర్భాల్లోనూ ఆయన ‘నేను ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నానని’ రెండు ముక్కల్లో తేల్చేశారు. ఇవి కాకుండా అద్వానీ 2 పార్లమెంట్ కమిటీ రిపోర్టులను సభలో ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా ఆయన రిపోర్ట్ పేరు చెప్పి ‘దీనిని సభ ముందుంచుతున్నానని’ చెప్పారు. కశ్మీర్ పై చర్చ సందర్భంగా ఆయన ఐదోసారి మాట్లాడారు. కశ్మీర్ శరణార్థుల గురించి మాట్లాడుతూ ఒక పాత రిపోర్ట్ ని ప్రస్తావించి దానిని ఎలా అమలు చేయాలో ఆలోచించాలని సూచించారు. ఈ ఐదుసార్లలో 365 పదాలు మాట్లాడేందుకు అద్వానీ తీసుకున్న సమయం సుమారుగా 3 నిమిషాలు మాత్రమే. ఇది ఒకప్పుడు లోహ పురుషుడి పేరుపడ్డ అద్వానీ గత ఐదేళ్లలో లోక్ సభలో మాట్లాడిన తీరు.