జగిత్యాలలో నడిరోడ్డుపై గొడ్డలితో బీభత్సం

జగిత్యాలలో నడిరోడ్డుపై గొడ్డలితో బీభత్సం

జగిత్యాల జిల్లాలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయి గొడ్డలితో బీభత్సం సృష్టించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల టౌన్ లోని విద్యానగర్‌లో 2 గుంటల భూమి విషయంలో తిప్పర్తి కిషన్‌, లక్ష్మణ్‌ల మధ్య వివాదం నడుస్తుంది. రిజిస్ట్రేషన్ డబ్బుల విషయంలో తగాదా మరింత ముదిరింది. ఈ భూమి విషయంలో నష్టపోయానని భావించిన లక్ష్మణ్, కిషన్‌పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల టవర్‌ సర్కిల్‌ సమీపంలోని సార్గమ్మ వీధిలో ఉంటున్న కిషన్‌ వద్దకు చేరుకున్న లక్ష్మణ్‌.. ద్విచక్ర వాహనంలో ఉంచిన గొడ్డలిని బయటకుతీసి విచక్షణారహితంగా దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కిషన్‌ను తీవ్రంగా గాయపరిచిన లక్ష్మణ్‌ ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం స్థానికులు బాధితుడిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.