శారదా నుంచి హిమంత బిశ్వ శర్మకు రూ.3 కోట్లు ముట్టాయ్

శారదా నుంచి హిమంత బిశ్వ శర్మకు రూ.3 కోట్లు ముట్టాయ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై పోరాటంలో మరింత దూకుడు పెంచారు. సీబీఐ, బీజేపీలపై దాడికి పదును పెడుతూ ఆమె శారదా గ్రూప్ అధినేత సుదీప్త సేన్ రాసిన ఒక లేఖను మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన చెందిన అస్సాం మంత్రి హిమంత బిశ్వ శర్మ తనను కనీసం రూ.3 కోట్ల మేర మోసం చేసినట్టు సేన్ ఆ లేఖలో ఆరోపించారు. ప్రస్తుతం శర్మ అస్సాం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

ఏప్రిల్ 6, 2013న కోల్ కతాలోని సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి రాసిన 19 పేజీల లేఖలో సుదీప్తో సేన్ పలు సంచలన విషయాలు బయటపెట్టాడు. ‘మరో అత్యున్నత స్థాయి వ్యక్తి నన్ను నాటకీయంగా మోసం చేశాడు. అతను హేమంత బిశ్వ శర్మ. గత ఆరు నెలల్లో, ఏడాదిన్నరగా తీసుకున్నది పక్కనపెడితే, అతను మా నుంచి కనీసం రూ.3 కోట్ల నగదు తీసుకున్నాడు. అతని తరఫున అతని కార్యాలయ సిబ్బంది ఎవరో కొన్ని వోచర్లపై సంతకాలు చేశారు. ఆ మొత్తాన్ని కంపెనీకి ఇస్తే దాంతోనే బెంగాల్ ప్రాంత రుణదాతలకు చెల్లింపులు జరపాల్సి ఉంది. ఎందుకంటే ఆ డబ్బుని ఎప్పుడూ కలకత్తా ఆఫీస్ నుంచే ఇచ్చాం.’ అని పేర్కొన్నాడు.

సేన్ లేఖ ఆధారంగా ‘సీబీఐ మోడీ బాబు (ప్రధానమంత్రి నరేంద్ర మోడీ) ఆడమన్నట్టల్లా ఆడుతోంది. ప్రతిపక్ష నేతలను ఎంచుకొని టార్గెట్ చేస్తోంది. బీజేపీలో చేరినవారిపై ఎలాంటి వేధింపులు ఉండవు. ఎవరైతే వ్యతిరేకంగా గొంతెత్తుతారో వాళ్లకి దాడులు తప్పవు. భారతదేశంలో ఇలాంటి వాటిని సహించరాదు. అత్యవసరంగా సంస్థలను సంరక్షించుకోవాల్సి ఉంది. చిట్ ఫండ్ కంపెనీల నుంచి డబ్బు తీసుకున్న బీజేపీ నేతలపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని’ మమత ప్రశ్నించారు.