డిపాజిట్ల సేకరణలో ప్రైవేట్ బ్యాంకులదే పైచేయి

డిపాజిట్ల సేకరణలో ప్రైవేట్ బ్యాంకులదే పైచేయి

డిపాజిట్ల సేకరణ యుద్ధంలో ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రైవేట్ రంగ బ్యాంకులు నెగ్గుతున్నాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాలు అదే చెబుతున్నాయి. గత ఐదేళ్ల వెయిటెడ్ యావరేజ్ టర్మ్ డిపాజిట్ రేట్లు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ ప్రత్యర్థుల మధ్య వ్యత్యాసం బాగా పెరిగింది. దీనిని బట్టి రేట్లు పెంచి అధిక రుణ వృద్ధి సాధించడంలో ప్రైవేట్ బ్యాంకుల సామర్థ్యం స్పష్టమైంది. 

ఆర్బీఐ డేటాను విశ్లేషించిన ఎలారా సెక్యూరిటీస్, ప్రైవేట్ బ్యాంకుల సగటు టర్మ్ డిపాజిట్ రేట్లు డిసెంబర్ 2018లో 43 బేసిస్ పాయింట్లు ఉన్నట్టు చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల 6.78 శాతంతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు 7.21 శాతం సాధించాయి. ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01 పర్సెంటేజీ పాయింట్. 

ఐదేళ్లలో ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల మధ్య వ్యత్యాసం ఇదే అత్యధికం. వేగంగా విస్తరిస్తున్న ప్రైవేట్ బ్యాంకులు అధిక వడ్డీ ఇస్తూ డిపాజిట్ల సేకరణలో దూసుకుపోతున్నాయి. ఈ ఒరవడి ఏప్రిల్ 2017 నుంచి ప్రారంభమైనట్టు డేటాతో స్పష్టమవుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన ప్రమాదరహిత లిక్విడిటీ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే తక్కువ రేటు ఆఫర్ చేసి ప్రైవేట్ బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్లు సేకరించాయి. 

జనవరి-ఏప్రిల్ 2017 మధ్య ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల రేట్లు 8-10 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉండగా ఆ తర్వాత పరిస్థితి వేగంగా మారింది. వనరుల సేకరణ రేసులో ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకుల కంటే దూకుడుగా వ్యవహరించాయని ఎలారా సెక్యూరిటీస్ తెలిపింది.