అమెరికాలోని ఆ చట్టసభలో మహిళల సంఖ్య అధికం

అమెరికాలోని ఆ చట్టసభలో మహిళల సంఖ్య అధికం

ఈ వారం ఏర్పాటైన అమెరికాలోని నెవాడా చట్టసభ ఒక చరిత్ర సృష్టించింది. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సభలో మహిళా ప్రతినిధులు పురుషుల కంటే అధిక సంఖ్యలో ఉన్నారు. 63 సీట్ల నెవాడా లెజిస్లేచర్ లో 32 స్థానాలను మహిళా సభ్యులు దక్కించుకొన్నారు. వీరిలో 23 మంది రాష్ట్ర శాసనసభలో, 9 మంది రాష్ట్ర సెనేట్ కి ఎన్నికైనట్టు నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ తెలిపింది. దీంతో నెవాడా లెజిస్లేచర్ లో 50.8 శాతం మహిళలు ఉన్నట్టు అయింది. ఇది రాష్ట్రంలోనే కాదు, అమెరికాలోనే ఒక కొత్త రికార్డ్.

సోమవారం ప్రారంభమైన 80వ నెవాడా లెజిస్లేచర్ సమావేశాలకు హాజరైన ఈ మహిళా ప్రతినిధులు పూర్తి సన్నాహాలతో వచ్చారు. డెమోక్రటిక్ మెజారిటీ నేత థెరెసా బెనిటెజ్-థాంప్సన్ ఈ విశేషాన్ని సభలో ప్రస్తావించారు. 'మనకి ముందున్న అమ్మమ్మలు, బామ్మలు..పదుల సంఖ్యలోని ఇతర మహిళా శాసనసభ్యురాళ్లతో కలిసి మన మార్గాన్ని సుగమం చేశారు. ఇప్పుడు ఈ మార్గంలో మనం ముందుకు సాగుదాం' అని ఆమె పిలుపునిచ్చారు. 'మా ఈ ప్రయాణం శ్రమతో కలగలిసి మరింత బలోపేతం అవుతుంది. మేం ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని గర్వించేలా చేస్తాం' అని చెప్పారు.

సాధారణంగా ఓటింగ్ పట్టికలను చూపించే కార్సన్ సిటీ లెజిస్లేటివ్ ఛాంబర్ లోని పెద్ద స్క్రీన్లు ఈ మైలురాయిని ప్రదర్శించాయి. మహిళలు ఇంత పెద్దసంఖ్యలో చట్టసభకు ఎంపికయ్యేందుకు కృషి చేసిన నెవాడా మహిళల వివరాలను చూపించారు. ఛాంబర్ లో ఎక్కువ మంది మహిళలు ఉంటే రాష్ట్ర సమస్యలను లెజిస్లేచర్ సృజనాత్మక మార్గాల్లో పరిష్కరించవచ్చని ఒక సభ్యురాలు అభిప్రాయపడ్డారు. 'ఈ సారి సభలో వైవిధ్యం ఉండబోతోంది. ఆలోచనల్లో వైవిధ్యం కనిపించబోతోంది. అభిప్రాయాల్లో వైవిధ్యం ప్రతిఫలించబోతోంది. జీవితానుభవాల వైవిధ్యం ప్రతిబింబించనుందని' రాష్ట్ర మైనారిటీ విప్ లీసా క్రాస్నర్ తెలిపారు.