వరల్డ్ కప్ ఫైనల్ జట్లు భారత్, ....:సుందర్ పిచాయ్

వరల్డ్ కప్ ఫైనల్ జట్లు భారత్, ....:సుందర్ పిచాయ్

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019  ఫైనల్ పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన జోస్యం చెప్పారు. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, ఆతిథ్య ఇంగ్లాండ్ జట్లు తలపడతాయని పిచాయ్ అంచనా వేశారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు మంచి ప్రదర్శన కనబరచి టైటిల్ గెలవాలని ఆయన ఆకాంక్షించారు. తనో పెద్ద క్రేజీ క్రికెట్ ఫ్యాన్ గా చెప్పుకొన్న పిచాయ్, అమెరికా వచ్చిన కొత్తల్లో బేస్ బాల్ ఆడటం పెద్దగా ఛాలెంజ్ గా భావించినట్టు తెలిపారు.

యుఎస్ఐబీసీ 'ఇండియా ఐడియాస్ సమ్మిట్' లో మాట్లాడుతూ 'ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరగాలి. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా చాలా బాగా ఆడతాయి' అని పిచాయ్ అభిప్రాయపడ్డారు. యుఎస్ఐబీసీ అధ్యక్షురాలు నిషా దేశాయ్ బిస్వాల్ 'ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరుగుతుందని అనుకుంటున్నారన్న' ప్రశ్నకు జవాబు ఇస్తూ పిచాయ్ ఇలా చెప్పారు. 

అమెరికాలో క్రికెట్, బేస్ బాల్ లతో తన అనుభవాలను పిచాయ్ ప్రేక్షకులతో పంచుకున్నారు. ' నేను మొదటి సారి ఇక్కడికి వచ్చినపుడు నేను బేస్ బాల్ ఆడేందుకు ప్రయత్నించాను. అది చాలా సవాలుతో కూడుకుందనుకుంటున్నాను. నా మొదటి మ్యాచ్ లోనే బంతిని వెనక్కి కొట్టి నేను ఎంతో సంతోషపడ్డాను. నిజానికి క్రికెట్ లో అది చాలా మంచి షాట్. కానీ ఎవరూ నన్ను అందుకు అభినందించలేదు' అని చెప్పారు.

'క్రికెట్ లో మీరు రన్ తీసేటపుడు బ్యాట్ తో పాటు పరుగెడతారు. అందుకని నేను బేస్ బాల్ లో కూడా బ్యాట్ తో పాటు పరిగెత్తాను. ఇదంతా చూశాక బేస్ బాల్ సవాళ్లతో కూడుకుందని నాకర్థమైంది. నేను ఎన్నో విషయాల్లో నన్ను నేను మార్చుకోగలను. కానీ క్రికెట్ పై నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని' తెలిపారు. 'క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతోంది. ఇది చాలా మంచి టోర్నమెంట్. భారత్ బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను' అన్నారు.