యూనియన్ బడ్జెట్..! ట్యాక్స్ పేయర్స్‌లో ఉత్కంఠ...!

యూనియన్ బడ్జెట్..! ట్యాక్స్ పేయర్స్‌లో ఉత్కంఠ...!

గతేడాది ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించిన మోడీ సర్కార్‌... 2020 బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ఇది మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగే అంశం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే పన్ను చెల్లింపుదారులకు డబ్బు ఆదా అయ్యే మార్గాలను అన్వేషించాల్సిందేనంటున్నారు నిపుణులు. అందుకే, ఈసారి పన్ను రేట్ల తగ్గింపు ఉండొచ్చని భావిస్తున్నారు. కొత్త పన్ను స్లాబులు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు చెబుతున్నారు. పన్ను రేట్ల తగ్గింపుతోపాటు ఈసారి బడ్జెట్‌లో సెక్షన్ 80సీ పరిమితిపై కూడా కీలక నిర్ణయం వెలువడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెంచొచ్చనే అంచనాలున్నాయి. దీంతో పన్ను చెల్లింపుదారులకు టేక్‌ హోమ్ శాలరీ పెరుగుతుంది.

మోడీ సర్కార్ తీసుకొస్తున్న 2020 బడ్జెట్‌లో ఇంటి కొనుగోలుదారులకు కూడా ప్రయోజనం కలిగించే నిర్ణయాలు ఉండే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఆదుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగానికి వడ్డీ రాయితీ పరిమితి పెంపు సహా పలు ప్రయోజనాలు చేకూరవచ్చంటున్నారు. ఈసారి బడ్జెట్‌లో వయో వృద్ధులకు లాభదాయకమయ్యే పలు నిర్ణయాలు ప్రకటించొచ్చనే అవకాశం ఉంది. సాధారణంగా,  సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి వాటిపై వడ్డీ రేట్లు మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో వ్యవస్థలో వడ్డీ రేట్లు తగ్గితే.. ఆ ప్రభావం వీటిపై పడుతుంది. అలాంటి పరిస్థితులు లేకుండా మోడీ సర్కార్.. సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకోవచ్చు. మరోవైపు ప్రత్యక్ష పన్నులపై ఏర్పాటైన కమిటీ ఇప్పటికే ట్యాక్స్ స్లాబ్స్‌లో మార్పులను సూచించింది. 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి 10 శాతం ట్యాక్స్ రేటును, 10 లక్షల నుంచి 20 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి 20 శాతం, 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి 30 శాతం ట్యాక్స్ రేటు వర్తింప జేయాలని సూచించింది. ఇక 2 కోట్లకు పైన ఆదాయం ఉంటే 35 శాతం ట్యాక్స్ రేటు వర్తింపజేయాలని తన నివేదికలో పేర్కొంది. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.