సచిన్, ధోనీలను వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ

సచిన్, ధోనీలను వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ

భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లోని ఐదోది, చివరిదైన మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ వన్డే కెరీర్ లో ఒక ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నాడు. హిట్ మ్యాన్ ఆస్ట్రేలియాపై 46వ పరుగు చేయడంతోనే వన్డే క్రికెట్ లో 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీలను వెనక్కి నెట్టాడు. 

రోహిత్ శర్మ వన్డే క్రికెట్ లో 8000 పరుగులు పూర్తి చేసిన 9వ భారతీయ, ప్రపంచంలో 31వ ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ కి ముందు 8000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్ మెన్ లలో సచిన్ టెండూల్కర్ (18426), సౌరవ్ గంగూలీ (11363), రాహుల్ ద్రవిడ్ (10889), విరాట్ కోహ్లీ (10843), మహేంద్ర సింగ్ ధోనీ (10500), మొహమ్మద్ అజహరుద్దీన్ (9378), యువరాజ్ సింగ్ (8701), వీరేంద్ర సెహ్వాగ్ (8273) ఉన్నారు.

రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల కంటే వేగంగా 8000 పరుగులు పూర్తిచేసిన రికార్డు బద్దలు కొట్టి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సమయం చేశాడు. సౌరవ్ గంగూలీ వన్డే క్రికెట్ లో 8000 పరుగులు చేసేందుకు 200 ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే ఇంటర్నేషనల్ లో అందరి కంటే వేగంగా 8000 పరుగులు  చేసిన రికార్డ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ ఈ రికార్డును 175 ఇన్నింగ్స్ లో అందుకున్నాడు. రెండో స్థానంలో ఏబీ డివిలియర్స్ (182 ఇన్నింగ్స్), మూడో స్థానంలో సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఇప్పుడో హిట్ మ్యాన్ దాదాతో సరిసమానంగా నిలిచాడు.