భారత్‌-బంగ్లా టీ20 సిరీస్: రెండో మ్యాచ్ జరిగేనా..?

భారత్‌-బంగ్లా టీ20 సిరీస్: రెండో మ్యాచ్ జరిగేనా..?

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌పై ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి.. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు వాయు కాలుష్యం అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినా ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఇక, వాతావరణ పరిస్థితులతో రాజ్‌కోట్ వేదికగా ఈ నెల 7వ తేదీన జరిగే రెండో టీ20 మ్యాచ్‌పై అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో 'సైక్లోన్ మహా' ఎఫెక్ట్ బలంగా ఉంది.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో రెండో టీ20కి తుపాన్ ముప్పు పొంచి ఉందంటున్నారు. మరోవైపు మ్యాచ్ జరగాల్సిన గురువారం రోజు భారీ వర్ష సూచన ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడంతో క్రికెట్ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచామని, మ్యాచ్ జరిగే రోజు ఉదయం వర్షం పడినా తక్కువ సమయంలోనే మ్యాచ్ నిర్వహణకు స్టేడియాన్ని సిద్ధం చేయగలమని దీమా వ్యక్తం చేస్తోంది సౌరాష్ట్ర క్రికెట్ సంఘం.