ఇండేన్ ఆధార్ నెంబర్లు భద్రంగా ఉన్నాయి

ఇండేన్ ఆధార్ నెంబర్లు భద్రంగా ఉన్నాయి

ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ ఇండేన్ లో భద్రతా లోపాల కారణంగా లక్షలాది వినియోగదారుల ఆధార్ సంఖ్యలు బహిర్గతమయ్యాయని ఫ్రెంచ్ సైబర్ పరిశోధకుడు బాప్టిస్ట్ రాబర్ట్ తన విశ్లేషణలో తెలియజేశారు. మంగళవారం ఉదయం బాప్టిస్ట్ తన ఆన్ లైన్ హ్యాండిల్..ఎలియట్ ఆల్డర్సన్ ద్వారా ఇండేన్ వెబ్ సైట్ లోని డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు చెందిన  ఒక భాగాన్ని బయటపెడుతూ పోస్ట్ చేశారు. అయితే ఇవన్నీ ఉత్తుత్తి ఆరోపణలేనని తమ వినియోగదారుల ఆధార్ సమాచారం భద్రంగా ఉన్నట్టు ఇండేన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

‘డేటాబేస్ లోకి చొరబడేందుకు కస్టమ్-బిల్ట్ స్క్రిప్ట్ ని ఉపయోగించి అతను 11,000 డీలర్ల దగ్గర ఉన్న వినియోగదారుల సమాచారం సాధించాడు. వినియోగదారుల పేర్లు, అడ్రస్ లతో పాటు ప్రతి రికార్డు లింకులో గోప్యంగా ఉన్న వారి వ్యక్తిగత ఆధార్ సంఖ్యలను కూడా పొందాడని’ టెక్ క్రంచ్ తన వార్తాకథనంలో పేర్కొంది. తను కనుగొన్న విశేషాల గురించి రాబర్ట్ బ్లాగ్ పోస్ట్ లో వివరించాడు. అతని స్క్రిప్ట్ బ్లాక్ కావడానికి ముందే 5.8 మిలియన్ల ఇండేన్ కస్టమర్ రికార్డులు కనుగొన్నాడు. మొత్తం ప్రభావిత కస్టమర్ల సంఖ్య 6.7 మిలియన్లకు పైనే ఉండొచ్చని రాబర్ట్ అంచనా వేశాడని’ తెలిపింది.

మంగళవారం మధ్యాహ్నం పెట్టిన ట్వీట్ లో ఇండియన్ ఆయిల్ రాబర్ట్ ఆరోపణలను తిరస్కరించింది. తమ వినియోగదారుల ఆధార్ సమాచారం లీక్ కాలేదని స్పష్టంగా ప్రకటించింది. 

అయితే రాబర్ట్ మాత్రం ‘స్థానిక డీలర్ల పోర్టల్ లో ఆథెంటికేషన్ లేనందువల్ల’ మొత్తం 67,91,200 మంది కస్టమర్ల సమాచారాన్ని ప్రభావితం చేయగలిగినట్టు చెప్పాడు.