సీఎం కుమారుడిపై సుమలత ఘన విజయం

సీఎం కుమారుడిపై సుమలత ఘన విజయం

జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ మనవడు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మాండ్య లోక్ సభ స్థానంలో చిత్తుగా ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత అంబరీష్ భార్య సుమలత చేతిలో 98,000 పై చిలుకు ఓట్లతో నిఖిల్ చిత్తయ్యారు. దీంతో ఇన్నాళ్లూ తాము చెప్పిందే వేదంగా పంతం నెగ్గించుకుంటున్న గౌడ కుటుంబానికి పెద్ద షాక్ తగిలినట్టయింది. 

కన్నడ సూపర్ స్టార్, రాజకీయ నేత అంబరీష్ భార్య అయిన సుమలత తనకు కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని భావించారు. కానీ మాండ్యపై తమ పట్టు సడలనివ్వరాదని భావించిన జేడీఎస్ దానిని పొత్తులో భాగంగా తీసుకొంది. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెకు బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది. జేడీఎస్ వైఖరిపై అలిగిన స్థానిక కాంగ్రెస్ నాయకత్వం సైతం సుమలత కోసం పనిచేసినట్టు తెలిసింది. అటు జేడీఎస్ మాండ్య గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. దీంతో హోరాహోరీ పోరుకు తెర లేచింది. 

ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలైనప్పటి నుంచి సుమలత స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. ఒక్కో రౌండ్ ఫలితాలు స్పష్టమవుతున్న కొద్దీ సుమలత అంబరీష్ ఆధిక్యం పెరుగుతూ పోయింది. నిఖిల్ కుమారస్వామి ఏ దశలో ఆధిక్యం కనబరచలేదు. చివరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న సుమలత నిర్ణయం సరైనదేనని ఫలితాలతో స్పష్టమైంది. మాండ్య జిల్లాపై గౌడ కుటుంబం ఆధిపత్యానికి దీంతో తెరపడినట్లేనని భావిస్తున్నారు.