అసలు పింక్‌ టెస్ట్‌ కథేంటి‌..?

అసలు పింక్‌ టెస్ట్‌ కథేంటి‌..?

అంతర్జాతీయ క్రికెట్లో కొత్తగా ఏ రూల్ తెచ్చినా.. విస్తృత ప్రచారం జరిగేది మాత్రం భారత్‌లో అది అమలైనప్పుడే. టెస్ట్ క్రికెట్‌కు పునరుజ్జీవం కలిగించాలని ఐసీసీ 2015లోనే డే/నైట్‌ టెస్టులకు అనుమతిచ్చింది. బీసీసీఐ, టీమిండియా వ్యతిరేకించడంతో ఇప్పటివరకు ఉపఖండంలో పింక్‌ బాల్‌ టెస్ట్‌ కల నెరవేరలేదు. మార్పులు, సంస్కరణలు ఇష్టపడే సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో పరిస్థితి మారింది. అతడు ప్రతిపాదించిన మూడే మూడు సెకన్లలో విరాట్‌ గులాబీ టెస్టుకు తలూపాడు. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేందుకు కనీసం రెండు, మూడు నెలలైనా పడుతుందని భావించారు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో రెండే టెస్టుకే ఒప్పించడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.  ఒకప్పుడు టీ20లు ఆడటంలోనూ భారత్‌ అంత సానుకూలంగా స్పందించలేదు. మిగతా జట్లన్నీ ప్రయత్నించాక చివరగా టీ20 క్రికెట్‌ను ఓకే చెప్పింది. తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ గెలవడం, ఈ ఫార్మాట్లోనే ఐపీఎల్‌ ఆరంభించడంతో ప్రపంచ క్రికెట్‌ ముఖచిత్రమే మారిపోయింది.

డీఆర్‌ఎస్‌ అంటే ఒకప్పుడు భారత్‌ ఆమడదూరం పరుగెత్తింది. మేం ఉపయోగించం. ఏం చేసుకుంటారో పొమ్మంటూ ఐసీసీకి సవాల్‌ విసిరింది. డోపింగ్‌ పరీక్షలు నిర్వహించే వాడా పరిధిలో ఇతర దేశాల క్రికెటర్లంతా ఉండగా, మేం మాత్రం సొంతంగా నిర్వహించుకుంటాం తప్ప అందరితో కలిసేది లేదని బీసీసీఐ కరాఖండీగా చెప్పింది. ఇటీవల ప్రభుత్వ ఒత్తిడితో దిగొచ్చింది. ఈ రెండు సందర్భాల్లో కూడా తగిన కారణం చెప్పి తమ నిర్ణయంపై స్పష్టత ఇవ్వడంకంటే బీసీసీఐ ఆధిపత్య ప్రదర్శనే ఎక్కువగా కనిపిస్తుంది. డే అండ్‌ నైట్‌ టెస్టుల విషయంలోనూ ఇప్పటి వరకు అదే తీరు కనిపించింది. ఐసీసీ పింక్‌ బాల్‌ టెస్ట్‌ గురించి ప్రతిపాదించినప్పుడు బీసీసీఐ ససేమిరా అంది. గులాబీ బంతి నాణ్యతపై సందేహాలు, ప్రాక్టీస్‌ కొరవడటం లాంటి కారణాలతో వెనుకంజ వేస్తూ వచ్చింది. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చొరవతో డే/నైట్‌ టెస్టుకు అంగీకారం తెలిపింది. టెస్ట్‌ క్రికెట్‌ మనుగడ సాగించాలంటే గులాబీ బాల్ టెస్ట్‌ అవసరమని గ్రహించాడు గంగూలీ.  వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

భారత్‌లో పర్యటించే బంగ్లా టీమ్‌ను పింక్‌ బాల్ మ్యాచ్‌ ఆడేందుకు ఒప్పించాడు. వారు ఒప్పుకోగానే ఈ చరిత్రాత్మక టెస్ట్‌కి చకాచకా అన్ని ఏర్పాట్లును దగ్గరుండి చూసుకున్నాడు గంగూలీ. ఇప్పటికే న్యూజిలాండ్‌, ఆసీస్‌, పాక్‌, ఇంగ్లండ్‌ లాంటి టాప్‌ టీమ్స్‌ గులాబీ  మ్యాచ్‌లను ఆడేశాయి. క్రికెట్‌లో ఎంతో క్రేజ్‌ ఉన్న టీమిండియా మాత్రం ఇప్పటివరకూ పింక్‌ టెస్ట్‌ ఆడలేదు. అటు బంగ్లాదేశ్‌ కు కూడా ఇదే మొదటి పింక్‌ బాల్‌ టెస్ట్‌. అయితే ఇప్పటికే టీమిండియాతో పాటు, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ప్రేక్షకులను స్టేడియానికి ఆకర్షించడంలో టెస్ట్ క్రికెట్ వెనకబడిపోయింది. పొట్టి క్రికెట్‌ రాకతో టెస్ట్‌ క్రికెట్‌ను చూసేవారే కరువయ్యారు. టీమిండియా, ఆసీస్‌ లాంటి జట్ల మధ్య మ్యాచ్‌లతో పాటు యాషెస్‌ లాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లకే జనం కనిపిస్తున్నారు. ఉచిత పాస్‌లు ఇవ్వడం, పెద్ద సంఖ్యలో విద్యార్థులను తీసుకురావడంవంటివి చేసినా టెస్ట్‌ క్రికెట్‌కు  పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇండియా లాంటి దేశంలో పగటి వేళ ఎండలు చాలా ఎక్కువ. ఎండ వేడి తట్టుకోలేక మ్యాచ్‌లకు రావడానికి ఫ్యాన్స్‌ ఇంట్రెస్ట్‌ చూపడం లేదు. ఇలాంటి ప్రేక్షకులను డే అండ్‌ నైట్‌ టెస్టులు కొంత ఆకర్షించవచ్చు. ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే ఈ తరహాలో ఏదైనా చేయాలనేది మొదటినుంచి గంగూలీ ఆలోచన. డే అండ్ నైట్‌ టెస్టులు నిర్వహించిన ప్రతిచోటా సానుకూల స్పందనే వచ్చింది. ఆటగాళ్లూ ఈ అనుభవం బాగుందన్నారు. క్రికెట్‌ లవర్స్‌ కొత్త అనుభూతి పొందారు. అయినప్పటికీ నాలుగేళ్ల వ్యవధిలో 11 గులాబి టెస్టులు మాత్రమే జరిగాయి. భారత్ లాంటి క్రేజ్‌ ఉన్న టీమ్‌ ఈ మ్యాచ్‌ల్లో భాగమై ఉంటే ఈపాటికి కథే వేరుగా ఉండేదేమో. చారిత్రక ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుండటం ఆసక్తిని మరింత పెంచనుంది. స్టేడియాలకు వెళ్లి చూసేవాళ్లే కాదు.. టీవీ వీక్షకులు సైతం ఈ మ్యాచ్‌ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్లే ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా సాగి సానుకూల స్పందన వస్తే.. మున్ముందు టీమిండియా మరిన్ని గులాబి టెస్టులు ఆడటం ఖాయం.