పాక్‌పై భారత్‌ ఘన విజయం

పాక్‌పై భారత్‌ ఘన విజయం

ఇటీవలి కాలంలో ఆట ఏదైనా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై విజయాలు సాధిస్తుంది భారత్. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 4-0 తేడాతో భారత్ చిత్తుగా ఓడించింది. కొత్త కోచ్‌ హరేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన భారత్‌ అన్ని విభాగాల్లో తమ ప్రతిభ చూపిస్తూ విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుండి ఆధిపత్యం చెలాయించిన భారత్ 13వ, 16వ నిమిషంలో లబించిన అవకాశాన్ని హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్స్ గా మలచడంలో విఫలమయ్యాడు. ఇక ఆట 26వ నిమిషంలో రమణ్‌దీప్‌ తొలి గోల్‌ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. వెంటనే పాక్‌ ఆటగాళ్లు భారత సర్కిల్‌లోకి వచ్చి గోల్‌  ప్రయత్నం చేసినా కీపర్‌ శ్రీజేష్‌ అడ్డుకున్నాడు.

మ్యాచ్‌ 43వ నిమిషంలో పాక్‌కు పెనాల్టీ కార్నర్‌ అవకాశం దక్కినా దాన్ని గోల్‌గా మలచలేకపోయింది. ఆఖరి ఐదు నిమిషాలు పాక్‌ను బెంబేలెత్తిస్తూ భారత్ వరుసగా మూడు గోల్స్‌తో చెలరేగింది. చివరి క్వార్టర్‌లో బంతిని తమ అధీనంలో ఉంచుకున్న భారత్.. దిల్‌ప్రీత్‌ అద్భుత గోల్‌తో భారత్‌ ఆధిక్యంను 2–0కు పెంచాడు. భారత ఆటగాళ్లు మన్‌దీప్, లలిత్‌ చెరో గోల్‌ చేసి 4–0తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపారు. ఆట సమయం పూర్తవడంతో భారత్‌ 4–0తో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం అర్జెంటీనాతో ఆడనుంది. 

Photo: FileShot