ప్రపంచంలోనే భారత్ డేటా చార్జీలు కారుచౌక

ప్రపంచంలోనే భారత్ డేటా చార్జీలు కారుచౌక

ప్రపంచంలో కారుచౌకగా మొబైల్ డేటా లభించే దేశం ఏదో తెలుసా? అగ్రరాజ్యం అమెరికా, అభివృద్ధి చెందిన యూరప్ దేశాలలో కాదు. ప్రపంచంలో ఒక్క మన భారతదేశంలోనే మొబైల్ డేటా చాలా చౌకగా దొరుకుతోంది. మొబైల్ డేటాకు ప్రపంచంలో ప్రజలు ఎంత చెల్లిస్తున్నారనే ఒక అధ్యయనంలో భారత్ లోనే డేటా ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నట్టు తేలింది. ఒక బ్రిటన్ లో యూరప్ లోనే అత్యంత ఖరీదైన డేటా ధరలు వసూలు చేస్తున్నట్టు స్పష్టమైంది. 

ధరలు పోల్చే వెబ్ సైట్ Cable.co.uk నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఒక గిగాబైట్ డేటా ధర భారత్ లో 0.26 డాలర్లు (0.20 పౌండ్లు) కాగా యుకెలో ఇది 6.66 డాలర్లుగా ఉంది. ఇక అమెరికాలో ఇది మరీ ఖరీదైన వ్యవహారం. ఒక గిగా బైట్ మొబైల్ డేటాకు అమెరికాలో సగటు ధర 12.37 డాలర్లు. ఈ ధరలు చూసిన విశ్లేషకులకు కళ్లు బైర్లు కమ్మాయి.

ప్రపంచవ్యాప్తంగా 230 దేశాలలో మొబైల్ డేటా ధరలను ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఈ జాబితాలో యుకెకి 136వ స్థానం దక్కింది. 1జీబీ డేటాకు ప్రపంచ సగటు ధర 8.53 డాలర్లుగా ఉంది. ఇక జింబాబ్వేలో 1జీబీ మొబైల్ డేటా కావాలంటే ప్రపంచంలోనే అత్యధికంగా 75.20 డాలర్లు వదుల్చుకోవాల్సిందే.

డేటా చౌకైన  టాప్ 5 దేశాలు

భారత్-0.26 డాలర్లు
కిర్గిజిస్థాన్-0.27 డాలర్లు
కజకిస్థాన్-0.49 డాలర్లు
ఉక్రెయిన్-0.51 డాలర్లు
రువాండా-0.56 డాలర్లు

డేటా ఖరీదైన టాప్ 5 దేశాలు 

జింబాబ్వే-75.20 డాలర్లు
ఈక్విటోరియల్ గినియా-65.83 డాలర్లు
సెయింట్ హెలెనా-55.47 డాలర్లు
ఫాక్లాండ్ ఐలాండ్స్-47.39 డాలర్లు
జిబౌతీ-37.92 డాలర్లు

ప్రపంచవ్యాప్తంగా డేటా ధరల్లో ఇంత భారీ వ్యత్యాసాలకు కారణాలు వివరించడం సంక్లిష్టమైన పని అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో అద్భుతమైన మొబైల్, ఫిక్స్ డ్ బ్రాడ్ బ్యాండ్ మౌలిక వసతులు ఉండటంతో అక్కడి ప్రొవైడర్లు భారీ డేటాను అందిస్తుండటంతో మొబైల్ డేటా చౌక ఉందని అంటున్నారు. అధునాతన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లు తక్కువగా ఉన్న దేశాలలో ప్రజలు ఎక్కువగా మొబైల్ డేటాపై ఆధారపడటంతో ధరలు మండిపోతున్నాయని అభిప్రాయపడ్డారు.