మ్యాచ్ మనదే.. సిరీస్ మనదే..

మ్యాచ్ మనదే.. సిరీస్ మనదే..

వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది.. మూడు టీ-20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన శుభారంభం చేసిన కోహ్లీసేన.. 2-0తో మూడు వన్డేల సిరీస్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించడంతో.. వన్డే సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు  చేసింది. క్రిస్‌ గేల్‌ 72, లూయిస్‌ 43 పరుగులతో విండీస్ ఇన్నింగ్స్‌లో కీలక భూమిక పోషించారు. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుకునే ప్రయత్నమే చేసింది.. దీంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ టార్గెట్‌ను 255 పరుగులుగా నిర్ధేశించారు.

ఇక, రెండో వన్డేలో మెరిసిన కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. చివరి వన్డేలోనూ 114 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 65 పరుగులతో చెలరేగిపోగా.. 32.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది భారత జట్టు. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. కాగా, వర్షం కారణంగానే తొలి వన్డే రద్దు చేసిన సంగతి తెలిసిందే.