ఐసీసీ ర్యాంకింగ్: వార్షిక అప్ డేట్ తర్వాత భారత్, ఇంగ్లాండ్ లే నెంబర్ వన్

ఐసీసీ ర్యాంకింగ్: వార్షిక అప్ డేట్ తర్వాత భారత్, ఇంగ్లాండ్ లే నెంబర్ వన్

గురువారం ఐసీసీ ర్యాంకింగుల్లో వార్షిక అప్ డేట్ తర్వాత టెస్టుల్లో భారత్, వన్డేల్లో ఇంగ్లాండ్ తమ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాయి. 2015-16 నుంచి సిరీస్ ఫలితాలను తొలగించిన తర్వాత ర్యాంకింగుల్లో అప్ డేట్ చేస్తున్నట్టు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016-17, 2017-18 ఫలితాల 50% పాయింట్లను ఇందులో కలపడం జరిగింది. 

2019 ప్రపంచ కప్ కు ఇంకా నెల రోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఇంగ్లాండ్ వన్డేల్లో మొదటి స్థానంలో ఉంది. కానీ రెండో స్థానంలో నిలిచిన భారత్ ఈ అంతరాన్ని తగ్గించడంలో సఫలీకృతమైంది. ఈ రెండు జట్ల మధ్య తేడా కేవలం రెండు పాయింట్లు మాత్రమే. టెస్ట్ ర్యాంకింగుల్లో భారత్, రెండో ర్యాంకులోని న్యూజిలాండ్ జట్ల మధ్య ఉన్న 8 పాయింట్ల తేడా ఇప్పుడు 2 పాయింట్లకు చేరింది.

అప్ డేట్ కి ముందు భారత్ 116 పాయింట్లు, న్యూజిలాండ్ 108 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ సేన దక్షిణాఫ్రికాపై 3-0తో విజయం, శ్రీలంకపై 2-1తో గెలుపును 2015-16 సీజన్ లో భాగంగా పరిగణించారు. దీంతో టీమిండియా 3 పాయింట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ రెండు 2-0 ఓటములు తొలగించేయడంతో వారికి మూడు పాయింట్లు లభించాయి. 

పాయింట్ల పట్టికలో ఒక్క స్థానం మాత్రమే మారింది. 105 పాయింట్లు సాధించిన ఇంగ్లాండ్ నాలుగో స్థానానికి చేరుకొని ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. ఆస్ట్రేలియా 6 పాయింట్లు కోల్పోయిన తర్వాత 98 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది., కంగారూ జట్టు 2015-16లో ఐదింట నాలుగు సిరీస్ లు నెగ్గింది. కానీ ఇవి లెక్కలోకి తీసుకోలేదు. ఏడో స్థానంలో పాకిస్థాన్, ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్ జట్ల మధ్య తేడా 11 నుంచి 2 పాయింట్లకు తగ్గింది.

వన్డే ర్యాంకింగ్ లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ ప్రపంచ కప్ లో నెంబర్ వన్ జట్టుగా దిగడానికి ముందు ఆడబోయే ఒకేఒక్క వన్డేలో ఐర్లాండ్ ను ఓడించాల్సి ఉంటుంది. తర్వాత పాకిస్థాన్ తో జరిగే సిరీస్ లో 3-2తో విజయం సాధించక తప్పదు. ఐర్లాండ్ తో మ్యాచ్ ఓడిపోతే పాకిస్థాన్ ను 4-1తో లేదా అంత కంటే మెరుగైన తేడాతో చిత్తు చేయాలి. దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ నుంచి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. వెస్టిండీస్ జట్టు శ్రీలంకను దాటి ఏడో స్థానంలో నిలిచింది. పెద్ద జట్లేవీ టాప్ 10 నుంచి వైదొలగకపోవడంతో ప్రపంచ కప్ లో ఈ 10 జట్లే ఆడటం ఖాయమైంది.