చారిత్రక మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయం..! ఆ నాలుగే అడ్డు..!
టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ విలవిల్లాడుతోంది. భారీ గెలుపునకు 4 వికెట్ల ముందు నిలిచింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే బంగ్లాకు భారీ షాక్ తగిలింది. 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మిడిలార్డర్లో రహీమ్, మహ్మదుల్లా ఆదుకోవడంతో స్కోరు బోర్డు కొంత ముందుకు కదిలింది. ఆట ముగిసే సమయానికి 152 పరుగులు చేసిన బంగ్లా 6 వికెట్లు కోల్పోయింది. 59 రన్స్‌తో రహీమ్ క్రీజులో నిలిచారు. బంగ్లా బ్యాటింగ్‌పై ఇషాంత్ శర్మ మరోసారి దెబ్బకొట్టాడు. నిప్పులు చెరిగే బంతులతో 4 వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్ 2 వికెట్లతో రాణించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 347 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లా ప్రస్తుతానికి 89 పరుగుల ట్రైల్లో ఉంది. ఇక పింక్ బాల్ (డే/నైట్ టెస్ట్) టెస్ట్ కు శ్రీకారం చుట్టిన టీమిండియా.. ఈ చారిత్రక మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయానికి మరో నాలుగు అడుగుల దూరంలో ఉంది. ఆ నాలుగు వికెట్లు తీసి.. చారిత్రక మ్యాచ్‌లో తొలి విక్టరీని భారత్ తన ఖాతాలో వేసుకోవడం లాంఛనమే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)