మూడేళ్ల కనిష్టానికి బంగారం..!

మూడేళ్ల కనిష్టానికి బంగారం..!

విశ్లేషకులు ఊహించినట్టుగానే బంగారం డిమాండ్‌ అంతకంతకూ క్షీణిస్తోంది. బంగారం వినియోగంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఇండియాలో డిమాండ్ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయే ఛాన్స్‌ ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. దేశీ మార్కెట్‌లో ధరలు గరిష్ట స్థాయికి చేరడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గడం వంటి పలు అంశాలను ఇందుకు కారణంగా డబ్ల్యూజీసీ తెలిపింది. దేశంలో అత్యంత పవిత్రమైన ధంతెరాస్‌ రోజున సైతం అమ్మకాలు గత నెలలో పడిపోయాయి. ఇది బలహీనమైన డిమాండ్‌ను మరింత సూచిస్తుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో డిమాండ్‌ మూడొంతులలో రెండొంతులు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుంది. గత 25 ఏళ్ల కాలంలో జూన్‌-సెప్టెంబర్‌ సీజన్‌లో వానలు అధికంగా పడ్డాయి. ఇది అక్టోబర్‌లోనూ కొనసాగింది. ఫలితంగా సిద్ధంగా ఉన్న వేసవి కాల పంటలయిన పత్తి, సోయాబీన్‌, చిరుధాన్యలు నాశనమయ్యాయి. 

ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర జీవితకాల గరిష్ఠమైన స్థాయికి చేరుకుంది. మొత్తంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, దేశీయ కరెన్సీ రూపాయి  క్షీణించడంతో ఈ ఏడాదిలో బంగారం ధరలు 22 శాతం పైగా పెరిగాయి. దేశీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో బంగారం డిమాండ్‌ జులై-సెప్టెంబర్‌లో తగ్గిందని డబ్యూజీసీ పేర్కొంది. ఈ ఏడాది జులై మొదటి వారంలో ఇండియా బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది.  జూలై-సెప్టెంబర్ కాలంలో నికర దిగుమతులు 66 శాతం క్షీణించాయి. ఇండియా మార్కెట్‌లో బంగారం ధరలు 2019లో అంతర్జాతీయంగా ఉన్న ధర కంటే 17 శాతం పెరిగాయి. డిమాండ్‌ మందగించడంతో బంగారం దిగుమతులు తగ్గాయని విశ్లేషకులు అంటున్నారు.