నేడే రెండో టీ20..కోహ్లీసేనకి కలిసొచ్చేది అదే ?

నేడే రెండో టీ20..కోహ్లీసేనకి కలిసొచ్చేది అదే ?

 ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. సొంతగడ్డపై సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకలను మట్టికరిపించిన భారత్.. రచ్చ గెలవడానికి న్యూజిలాండ్ టూర్‌కు వచ్చింది. తొలి టీ20లోనే గ్రాండ్‌ విక్టరీతో ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. ఇప్పుడు అదే జోరు కొనసాగించేందుకు రెడీ అయింది కోహ్లీసేన. ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా జరగనున్న రెండో టీ20లో గెలుపే లక్ష్యంగా టీమిండియా, కివీస్‌ బరిలోకి దిగుతున్నాయ్‌. దీంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఫస్ట్‌ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టీ20కి  కూడా అదే ఊపుతో సిద్ధమైంది.

మొదటి టీ20 జరిగిన ఆక్లాండ్‌ వేదికగానే రెండో మ్యాచ్‌ కూడా జరగనుంది. దీంతో కోహ్లి  గ్యాంగ్‌ మరో గెలుపుపై కన్నేసింది. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌లో మరింత ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఇప్పటికే తుది జట్టుపై స్పష్టతకు వచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్‌.. మార్పులు చేసేందుకు సై అంటోంది. తొలి టీ20లో ఆటను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయాలని భావిస్తోంది. ఫస్ట్‌ మ్యాచ్‌ను ఓవరాల్‌గా చూస్తే రోహిత్ శర్మ, శివం దూబేలతో పాటు శార్దూల్ ఠాకూర్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే హార్డ్‌ హిట్టర్‌ అయిన శివం దూబెను రెండో మ్యాచ్‌ నుంచి తొలగించకపోవచ్చు.

బ్యాటింగ్‌లో సత్తాచాటకపోయినా, పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా వికెట్‌ తీసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఇక రోహిత్ శర్మ రెండో టీ20లో రాణించి గాడిలో పడాలని చూస్తున్నాడు. తొలి టీ20లో రాహుల్‌, కోహ్లిలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దితే, అయ్యర్‌ సమయోచితంగా ఆడాడు. అయ్యర్‌కు మనీష్‌ పాండే నుంచి చక్కటి సహకారం లభించింది. బౌలింగ్‌ విభాగంలో షమీతో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ అంచనాలను అందుకోలేదు. షమీ ప్రధాన బౌలర్‌ కావడంతో అతన్ని తప్పించే సాహసం చేయరు. ఇక శార్దూల్‌ వికెట్‌ సాధించినా మూడు ఓవర్లు వేసి 44 పరుగులిచ్చాడు. దీంతో శార్దూల్‌పై వేటు తప్పేలా లేదు.ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న నవదీప్‌ సైనీని తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది.

కేఎల్‌ రాహుల్‌ అటు కీపర్‌గా బ్యాట్స్‌మన్‌గా సత్తాచాటడంతో పంత్‌, శాంసన్‌లకు నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు. మరోవైపు వన్డే వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ అన్ని ఫార్మాట్లలో తడబడుతోంది. ఆటగాళ్ల గాయాలు ఆ జట్టును ఇబ్బంది పెడుతున్నాయ్‌. బౌల్డ్, ఫెర్గూసన్ వంటి బౌలర్లు దూరమవ్వడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి టీ20లో 200 పైచిలుకు చేసినా కాపాడుకోలేకపోయింది. విలియమ్సన్, గప్టిల్, టేలర్‌లతో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్ పటిష్టంగా ఉంది. ఇక బౌలర్లు అందరూ ఫస్ట్‌ టీ-20లో చేతులేత్తేశారు. దీంతో బౌలింగ్‌లో సత్తా చాటి.. టీమిండియాను కట్టడి చేయాలని కివీస్‌ భావిస్తోంది. గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా హాట్ ఫేవరేట్ అయినప్పటికీ ఆతిథ్య జట్టును తక్కువ అంచానా వేయలేం. అటు ఈడెన్‌ పార్క్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారే అవకాశం ఉంది.