వరల్డ్‌కప్‌ సెమీస్‌లోకి భారత్‌

వరల్డ్‌కప్‌ సెమీస్‌లోకి భారత్‌

వరల్డ్‌కప్‌ మెగా టోర్నీలో టీమిండియా మరో అడుగు ముందుకేసింది. ట్రోఫీకి మరింత దగ్గరైంది. బంగ్లాదేశ్‌పై సూపర్‌ విక్టరీతో సెమీఫైనల్స్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. ఎడ్జ్‌బాస్టన్‌లో బంగ్లాదేశ్‌ను 28 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌తో టాస్‌ గెలిచి తొలి బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 92 బంతుల్లో 104 పరుగులతో సిరీస్‌లో మరో సెంచరీ నమోదు చేశాడు. రాహుల్‌ 77, పంత్‌ 48 పరుగులతో ఆకట్టుకున్నారు. బంగ్లా స్వింగ్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ 59 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 

315 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. తొలి పవర్‌ప్లేలో 40 పరుగులు చేసింది. ఓపెనర్లు రాణిస్తున్న సమయంలో తమీమ్‌ను 22 పరుగుల వద్ద షమీ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత సౌమ్య సర్కార్‌ (33) వెనుదిరగగా.. షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌లు జట్టును ఆదుకున్నారు. ఈక్రమంలో ముష్ఫికర్‌ను చాహల్‌ అవుట్‌ చేయడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. లిటన్‌ దాస్‌ (22) విఫలం కాగా, 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్‌ అవుటయ్యాడు. చివర్లో సైఫుద్దీన్‌, షబ్బీర్‌ పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా 4, పాండ్య 3 వికెట్లు తీశారు.