ఈ ఏడాది దేశంలో సాధారణంగానే రుతుపవనాలు: వాతావరణశాఖ

ఈ ఏడాది దేశంలో సాధారణంగానే రుతుపవనాలు: వాతావరణశాఖ

వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ కు ప్రభుత్వ రంగంలోని భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దేశంలో సగానికి పైగా వ్యవసాయ భూములను తడిపే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది దాదాపుగా సాధారణంగా వర్షపాతాన్నిస్తాయని ఐఎండీ ప్రకటించింది. భారత్ లో ఎల్ నినో ఛాయలు కమ్ముకొనే అవకాశాలు ఉంటాయనే వార్తల మధ్య ఐఎండీ అంచనాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊపునిచ్చేలా ఉన్నాయి.

జూన్-సెప్టెంబర్ ల మధ్య వర్షాకాలంలో వార్షిక వర్షపాతం దీర్ఘకాల సగటు 96 శాతంగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈ అంచనాల్లో 5 శాతం వరకు తప్పిదం జరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ కార్యాలయం చెప్పింది. రాబోయే నెలల్లో ఎల్ నినో పరిస్థితులు బలహీన పడతాయని నైరుతి రుతుపవనాలపై తన మొదటి దీర్ఘకాలిక అంచనాలు ప్రకటించింది. మే చివరికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి.

భారత్ లో 70 శాతానికి పైగా వ్యవసాయం వర్షాలపై ఆధారపడి సాగుతుంది. అందువల్ల రుతుపవనాలను ఎంతో కీలకంగా భావిస్తారు. వార్షిక వర్షపాతం ద్వారానే వ్యవసాయం సాగడంతో పాటు పంటలకు నీరందించే రిజర్వాయర్లు నిండుతాయి. కోట్లాది మంది ఉపాధి, ఆహార ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచంలో వరి, గోధుమ, పత్తిని ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశంలో తక్కువ వర్షపాతం పడితే తక్కువ వ్యవసాయోత్పత్తి జరిగి వంటనూనెల వంటి వస్తువుల దిగుమతులకు డిమాండ్ ఎక్కువవుతుంది.