వామప్ మ్యాచ్‌లో తడబాటు

వామప్ మ్యాచ్‌లో తడబాటు

ఎసెక్స్ జట్టుతో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కి ముందు భారత జట్టు ఎసెక్స్ జట్టుతో ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. చెమ్స్‌ఫోర్డ్ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ శిఖర్ ధావన్(0) పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పుజారా(1) కూడా మూడో ఓవర్‌లో  వెనుదిరిగాడు. ఒకవైపు రెండు వికెట్లు పోయినా మరో ఓపెనర్‌ మురళీ విజయ్ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ అర్ధశతకం సాధించాడు. పుజారా అనంతరం క్రీజులోకి వచ్చిన రహానె(17) పరుగులు చేసేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ధాటిగా ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. లంచ్ అనంతరం కొద్ది వ్యవధిలో విజయ్(53), కోహ్లీ(68)లు కూడా వెనుదిరిగారు. 45 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 151  పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్(2), కార్తీక్(4)లు ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు మాట్ కోల్స్, వాల్టర్ చెరో రెండు వికెట్లు తీసారు.