ఏడోసారి పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

ఏడోసారి పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

దాయాది పాకిస్థాన్‌ను భారత్‌ మరోసారి చిత్తు చేసింది. వరల్డ్‌ కప్‌లో భారత్‌ చేతిలో పాక్‌ మరోసారి చతికిలపడింది. మాంచెస్టర్‌లో జరిగిన వరల్డ్‌కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగుల చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (140; 113 బంతుల్లో 14x4, 3x6) సూపర్‌ సెంచరీతోపాటు కోహ్లి (77; 65 బంతుల్లో 7x4), రాహుల్‌ (57; 78 బంతుల్లో 3x4, 2x6)లు అర్ధసెంచరీలు నమోదు చేశారు. హార్దిక్ పాండ్య (26), మహేంద్రసింగ్ ధోని (1) విజయ్ శంకర్ (15), కేదార్ జాదవ్ (9 ) ఆశించినంత మేరకు రాణించలేదు.   పాక్ బౌలర్లలో మహ్మల్ అమీర్ మూడు వికెట్లు పడగొట్టగా.. హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ తీశారు. 

337 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిని పాక్‌.. ఆరంభంలోనే ఓపెనర్ ఇమామ్ ఉల్ (7) వికెట్‌ను చేజార్చుకుంది. వన డౌన్‌లో వచ్చిన బాబర్ అజామ్ (48; 57 బంతుల్లో 3x4, 1x6)తోకలిసి నిలకడగా ఆడిన మరో ఓపెనర్ ఫకార్ జమాన్ (62; 75 బంతుల్లో 7x4, 1x6) రెండో వికెట్‌కి 104 పరుగులు జోడించారు. డేంజరస్‌గా మారుతున్న ఈ జోడీని కుల్దీప్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా 27వ ఓవర్‌లో వరుస బంతుల్లో హఫీజ్‌ (9), షోయబ్‌ (0)లను అవుట్‌ చేయడంతో పాక్‌ 12 పరుగులు తేడాలో 4 కీలక వికెట్లను చేజార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (12: 30 బంతుల్లో)ను విజయ్ శంకర్ క్లీన్‌ బౌల్డ్‌ చేయవడంతో పాక్ ఓటమి ఖాయమైంది. ఈ దశలో వర్షం పడడంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకి కుదించి టార్గెట్‌ని 302 పరుగులుగా నిర్దేశించారు అంజైర్లు. చివర్లో ఇమాద్ వసీమ్ (46 నాటౌట్; 39 బంతుల్లో 6x4) చెలరేగినా పాక్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో కుల్దీప్‌, విజయశంకర్‌, పాండ్య చెరో 2 వికెట్లు తీశారు.