ఐసీజేలో పాక్ దుర్భాషలపై భారత్ తీవ్ర అభ్యంతరం

ఐసీజేలో పాక్ దుర్భాషలపై భారత్ తీవ్ర అభ్యంతరం

అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో కుల్ భూషణ్ జాదవ్ కేసు విచారణ సందర్భంగా పాకిస్థాన్ న్యాయవాది ద్వేషపూరిత భాష ఉపయోగించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యుఎన్ న్యాయస్థానంలో ఉపయోగించే భాషపై లక్ష్మణరేఖ గీయాలని కోరింది. భారత్ తరఫున కేసు వాదిస్తున్న భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే రెండో రోజున తమ వాదనలు వినిపించిన పాకిస్థానీ న్యాయవాది ఖ్వాజా కురేషీ విద్వేషపూరిత భాష ఉపయోగించడాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

కుల్ భూషణ్ జాదవ్ కేసు రెండో అంచె బహిరంగ విచారణ ప్రారంభం కాగానే సాల్వే 'ఈ న్యాయస్థానంలో ఉపయోగించిన భాషను గుర్తించి ఈ కోర్టు కొన్ని లక్ష్మణరేఖలను నిర్ధారించాల్సి ఉంది. వారి ప్రసంగంలో ఉపయోగించిన భాషలో సిగ్గులేని, చెత్త, సిగ్గు పడాల్సిన.. వంటి పదాలను ఉపయోగించారు. దేశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇలాంటి పదాలతో సంబోధించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తోందని' చెప్పారు. 'పాకిస్థానీ వకీలు వాడిన విద్వేషపూరిత భాషపై భారత్ తన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని' అన్నారు.

జాదవ్ భారత నౌకాదళంలో రిటైరైన అధికారి. బంధించిన గదిలో ఆయనను ఏప్రిల్ 2017లో పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం విచారించింది. ఆయనపై 'గూఢచర్యం, ఉగ్రవాదం' నేరాలు మోపి మరణశిక్ష విధించింది.