బెదరగొట్టి సిరీస్ కైవసం చేసుకున్న భారత్

బెదరగొట్టి సిరీస్ కైవసం చేసుకున్న భారత్

పసికూన ఐర్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ను భారత్ సునాయసంగా గెలుచుకుంది... ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు సన్నాహకంగా భావించిన ఐర్లాండ్ సిరీస్‌లో కోహ్లీ సేన సత్తా చాటింది. ఐర్లాండ్-భారత్ మధ్య జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. భారత్ విసిరిన 214 పరుగుల లక్ష్యాన్ని ఏదశలోనూ ఛేదించేలా కనబడలేదు ఐర్లాండ్. 12.3 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు దుమ్ములేపింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

ఈ మ్యాచ్‌లో భారత్ కొన్ని ప్రయోగాలు చేసింది. ధావన్‌కు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్‌కు తోడుగా కెప్టెన్ కోహ్లీ ఓపెనర్ అవతారమెత్తాడు. అయితే మూడో ఓవర్‌లోనూ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్, రైనాలు ఐర్లాండ్ బౌలర్లలను ఓ ఆటాడుకున్నారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి తరలించారు. 10 ఓవర్లలోనూ భారత్ స్కోర్ 100 దాటింది. 36 బంతుల్లోనే రాహుల్ 70 పరుగులు చేశాడు. రోహిత్ శ్మర డకౌట్ అయ్యాడు. 45 బంతుల్లో రైనా 69 పరుగులు చేశాడు. అయితే చివర్లో హార్ధిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 9 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 214 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్ మన బౌలర్ల ధాటికి అల్లాడిపోయింది. దీంతో 70 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది ఐర్లాండ్.