నెదర్లాండ్స్‌తో భారత్‌ ఢీ

నెదర్లాండ్స్‌తో భారత్‌ ఢీ

ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనలే లక్ష్యంగా మరో సమరానికి సిద్దమయింది. గురువారం మాజీ చాంపియన్‌ నెదర్లాండ్స్‌ జట్టుతో క్వార్టర్‌ ఫైనల్‌లో తలపడనుంది. ఈ ఒక్క విజయం సాధిస్తే.. 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకూ తెర పడబోతోంది. 1975లో చివరిసారిగా భారత్‌ సెమీస్‌ చేరి టైటిల్ దక్కించుకుంది. ఇప్పుడు మేటి జట్లను ఓడించి పటిష్టంగా ఉన్న భారత్‌.. మరోసారి కప్పు అందుకోవాలని పట్టుదలగా ఉంది. మరి ఇది సాధించాలంటే మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన కష్టపడాల్సిందే. ఎందుకంటే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు నెదర్లాండ్స్‌ జట్టుతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్‌ విజయంను అందుకోలేదు. 5 మ్యాచ్‌ల్లో ఓడి, ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇక చివరిసారిగా భారత్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఫామ్‌ ప్రకారంగా కూడా నెదర్లాండ్స్‌ భారత్ కంటే మెరుగ్గానే ఉంది. గ్రూప్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ 12 గోల్స్‌ చేయగా.. నెదర్లాండ్స్‌ 18 గోల్స్‌ కొట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

కీలక మ్యాచ్ కాబట్టి భారత జట్టులో మన్‌దీప్‌ సింగ్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌, లలిత్‌ ఉపాధ్యాయ్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌ చెలరేగాల్సిన అవసరం ఉంది. డిఫెండర్లు హర్మన్‌ప్రీత్‌ సింగ్, బీరేంద్ర లాక్రా, సురేందర్‌ కుమార్‌లు మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది. గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ కూడా శక్తికి మించి రాణించాల్సిందే. అయితే సొంత అభిమానుల మద్దతు భారత్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు ఫార్వర్డ్, డిఫెన్స్‌లలో నెదర్లాండ్స్‌ పటిష్టంగా ఉంది. కీలక మ్యాచ్ లో ఒక్క పొరపాటు చేసినా.. భారత్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. నెదర్లాండ్స్‌ జట్టులో కెప్టెన్‌ బిల్లీ బాకర్‌, సెవె వాన్‌, జెరోన్‌, మిక్రో, రాబర్ట్‌లు ఫామ్ లో ఉన్నారు. కాబట్టి వారిని కట్టడి చేయడంపైనే భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రాత్రి  గం. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గురువారమే జరిగే మరో క్వార్టర్‌ ఫైనల్లో జర్మనీతో బెల్జియం ఆడుతుంది.