మోడీపై ట్రంప్ సెటైర్.. భారత్ ధీటైన కౌంటర్

మోడీపై ట్రంప్ సెటైర్.. భారత్ ధీటైన కౌంటర్

ఆఫ్ఘనిస్థాన్ లో లైబ్రరీ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిధులివ్వడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు వేశారు. ఆఫ్ఘన్-భారత్ ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న మైత్రి బంధంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలా లైబ్రరీని ఎవరు ఉపయోగించుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై కొన్ని గంటల్లోనే భారత్ గట్టిగా జవాబిచ్చింది. యుద్ధాలతో దారుణంగా దెబ్బతిన్న ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి అభివృద్ధి పనుల ద్వారా సాయం అందించడం కీలకమని చెప్పింది. ‘అభివృద్ధికి సాయం చేయడం ద్వారా మానవ జీవితాలను మార్చవచ్చని భారత్ బలంగా నమ్ముతుందని’ ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. 

అఫ్ఘన్‌ పునర్నిర్మాణానికి భారత్‌ ఎంతో కృషి చేస్తోందని చెప్పాయి. సామాజికంగా, ఆర్థికంగా అక్కడి ప్రజలకు సురక్షితమైన జీవనాన్ని అందించేందుకు భారత్‌ కృషి చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో చిన్న గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. అఫ్ఘనిస్థాన్‌లో 218 కిలోమీటర్ల పొడవైన రహదారి నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టులకు భారత్‌ నిధులు సమకూరుస్తోంది. దీనితో పాటు సల్మా డ్యాం, అఫ్ఘన్‌ కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా భారత్ నిర్మించి ఇచ్చింది. ఆ దేశ సైన్యానికి కావాల్సిన ఆయుధసంపత్తిని అందిస్తోంది. వందలాది మంది అఫ్ఘన్‌ భధ్రతా సిబ్బందికి శిక్షణ ఇస్తోందని’ భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

అంతకు ముందు ట్రంప్ తన కేబినెట్ సహచరులతో నిర్వహించిన సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై మాట్లాడుతూ నిత్యం అంతర్యుద్ధంతో అట్టుడికే ఆఫ్ఘనిస్థాన్‌లో ఎక్కడో 6,000 మైళ్ల దూరంలో ఉండే తామే ఎందుకు తాలిబన్లతో పోరాడాలని ట్రంప్ ప్రశ్నించారు. ఆఫ్ఘన్‌లో పోరు కోసం అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తోందన్నారు. పొరుగునే ఉన్న భారత్, రష్యా, పాకిస్థాన్‌లు ఎందుకు పోరాడవని అన్నారు. ‘‘రష్యా ఎందుకు పోరాడకూడదు? మేమే ఎందుకు పోరాడాలి? భారత్, పాకిస్థాన్ ఎందుకు పోరాడవు?’’ అని ట్రంప్ ప్రశ్నించారు. తాలిబన్లపై పోరాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా దేశాధినేతలు ఆఫ్ఘన్‌లో శాంతి స్థాపనకు చేయూతనిస్తామని చెబుతూ 100-200 మంది సైనికులను పంపిస్తామని చెప్పారని ట్రంప్ అన్నారు.

కొన్ని దేశాలు అఫ్ఘన్‌లో శాంతి స్థాపనకు, పునర్నిర్మాణానికి కొద్దిగా సాయం చేసి ఎంతో చేసినట్లు చెప్పుకుంటున్నారని ట్రంప్‌ ప్రధాని మోడీని ఉదాహరణగా చూపిస్తూ ఎద్దేవా చేశారు. ‘‘ఆఫ్ఘనిస్థాన్‌లో లైబ్రరీ నిర్మిస్తామని మోడీ పదేపదే నాతో చెప్పారు. కానీ యుద్ధ వాతావరణం ఉన్న అటువంటి ప్రదేశంలో దాని ఉపయోగం ఏంటి? అసలు దానిని ఉపయోగించేవారెవరు? ఓ ఐదు గంటలకు మించి అక్కడ ఉండగలమా?’’ అని ట్రంప్ అన్నారు.