ఎల్వోసీ దగ్గర భారీ ఫైరింగ్, 5 పాక్ పోస్టులు ధ్వంసం

ఎల్వోసీ దగ్గర భారీ ఫైరింగ్, 5 పాక్ పోస్టులు ధ్వంసం

జమ్ముకశ్మీర్ లోని పలు ప్రాంతాలలో మంగళవారం నియంత్రణ రేఖ ఆవల పాకిస్థాన్ మోర్టార్, మిస్సైళ్లు ప్రయోగించింది. దీంతో కనీసం ఐదుగురు భారతీయ సైనికులు గాయపడ్డారు. సరిహద్దు నుంచి 5 కి.మీల పరిధిలోని స్కూళ్లలో పరీక్షలను ఆపేశారు. పాకిస్థాన్ సైన్యం జమ్ము, రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో ఎల్వోసీ వెంబడి 12-15 స్థానాల్లో భారీ ఆయుధాలతో కాల్పులు జరిపి యుద్ధవిరామాన్ని ఉల్లంఘించిందని రక్షణశాఖ ప్రతినిధి చెప్పారు. భారత్ కూడా పాకిస్థాన్ సైన్యానికి చెందిన 5 పోస్టులను నేలమట్టం చేసింది.

భారతీయ సైన్యం కూడా పాకిస్థాన్ పై కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత సైనికులు పాకిస్థాన్ ఐదు పోస్టులను టార్గెట్ చేసుకొని కాల్పులు జరిపారు. ఈ చర్యలో కొందరు పాక్ సైనికులు మరణించినట్టు సమాచారం. పాక్ సైనికులు స్థానిక గ్రామీణులను మానవ కవచాలుగా మార్చుకొంటున్నట్టు తెలిసింది. సాధారణ పౌరుల ఇళ్ల నుంచి మోర్టార్లు, మిస్సైళ్లు ప్రయోగిస్తూ కనిపించినట్టు చెబుతున్నారు. భారతీయ సైన్యం గ్రామీణ ప్రాంతాలకు దూరంగా పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొంది. ఈ కాల్పుల్లో భారతీయ సైనికులు 10 మంది గాయపడ్డారు.

పాకిస్థాన్ సైన్యం అఖ్నూర్, జమ్ము జిల్లాలోని పల్లన్ వాలా, రాజౌరీలో నౌషెరా, లామ్, ఝంగర్, పూంఛ్ లో మన్ కోట్, కేజీ సెక్టర్, ఖారీ కర్మారా, బాలాకోట్, పూంఛ్ లను టార్గెట్ చేసింది. రాజౌరీ, పూంఛ్ జిల్లా మెజిస్ట్రేట్ లు ముందు జాగ్రత్తగా బుధవారం నుంచి ఎల్వోసీకి ఐడు కి.మీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసేయించారు. మంగళవారం రాత్రి కాల్పుల విరమణ ఉల్లంఘన, చెక్ పోస్టులపై పాక్ కాల్పులు జరపడంతో కశ్మీర్ లోని ఉరి సెక్టర్ లో నియంత్రణ రేఖ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కల్గయీ గ్రామం నుంచి సైన్యం పాకిస్థాన్ పోస్టులపై భారీ కాల్పులు జరిపినట్టు స్థానికులు చెప్పారు. ఉరీలోని కొన్ని ప్రాంతాల నుంచి గ్రామీణులను సురక్షిత స్థానాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.

పాకిస్థాన్ సైన్యం తమపై నేరుగా కాల్పులు జరిపినట్టు పూంఛ్, రాజౌరీ జిల్లాల స్థానికులు చెప్పారు. భారత్ పాకిస్థానీ పోస్టులు, సైనిక రహిత ప్రాంతాల్లో కాల్పులు జరిపినట్టు పాకిస్థాన్ కు చెందిన డాన్ వార్తాపత్రిక ఆరోపించింది. భారత్ కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించారని, మరో 11 మంది గాయపడ్డారని తెలిపింది.