విండీస్‌ టూర్‌కు టీమిండియా సెలెక్షన్‌ వాయిదా..?

విండీస్‌ టూర్‌కు టీమిండియా సెలెక్షన్‌ వాయిదా..?

వెస్టిండీస్‌ పర్యటన కోసం టీమిండియా ఆటగాళ్ల ఎంపిక వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విండీస్‌ టూర్‌కు భారత జట్టును వాస్తవానికి రేపు ప్రకటించాల్సి ఉంది.  కానీ.. ఈ జట్టును ఎంపిక చేసేందకు శనివారం లేదా ఆదివారం సెలెక్టర్లు సమావేశమవుతారని తెలుస్తోంది. వరల్డ్‌కప్‌ ముగించుకుని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఇవాళే భారత్‌లో అడుగుపెట్టాడు. విండీస్‌ పర్యటనకు కోహ్లి అందుబాటులో ఉంటాడని తేలడంతో అతని సమక్షంలోనే భేటీ కావాలని సెలెక్టర్లు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అందుకే ఎంపికను వాయిదా వేశారని సమాచారం. 

వచ్చే నెలలో వెస్టిండీస్‌లో సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌ పోటీపడనుంది. ఈ సిరీస్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ అందుబాటులో ఉంటాడో లేదో అనే విషయమై సందిగ్ధం కొనసాగుతోంది. మనీష్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైనీలను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.