29 అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు

29 అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు

అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. కీలక వాణిజ్య అధికారాలను ఉపసంహరించినందుకు బదులుగా భారత్ శుక్రవారం 235 మిలియన్ డాలర్లు విలువైన 29 అమెరికన్ ఉత్పత్తులపై భారీగా ప్రతీకార సుంకాలు విధించింది. ప్రతీకార సుంకాలను వాయిదా వేయాల్సిందిగా ఎనిమిది సార్లు రెవెన్యూ శాఖకు వాణిజ్య మంత్రిత్వశాఖ  సూచించింది. దాదాపు ఏడాది జాప్యం తర్వాత వచ్చే వారం దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది. భారత్ లో సాధారణ ఎన్నికలు జరుగుతుండటంతో జూన్ 16 వరకు అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించడం వాయిదా పడింది. ప్రతీకార సుంకాలు ఎదుర్కొనబోయే అమెరికా ఉత్పత్తుల్లో బాదంపప్పు, వాల్నట్స్, యాపిల్స్ కూడా ఉన్నాయి. 

జాతీయ భద్రతా కారణాలను చూపుతూ మార్చి 23, 2018న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా స్టీల్ దిగుమతులపై 25 శాతం, అమెరికా అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకం విధించింది. గత నెల ట్రంప్ భారత్ కి కీలక జీఎస్పీ వాణిజ్య కార్యక్రమ లబ్ధిదారు హోదాను నిలిపేశారు. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్పీ) హోదా అమెరికా వాణిజ్య ప్రాధాన్యత కార్యక్రమంలో చాలా పెద్దది, పురాతనమైనది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధి కోసం లబ్ధిదారులైన దేశాల నుంచి వేలాది ఉత్పత్తులు ఎలాంటి సుంకం విధించకుండా అమెరికాలోకి అనుమతించబడతాయి. 

మార్చి 4న జీఎస్పీ కార్యక్రయం కింద అభివృద్ధి చెందుతున్న దేశంగా లబ్ధి పొందుతున్న భారత్ కు హోదా నిలిపేయాలని అమెరికా భావిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఆ 60 రోజుల నోటీస్ కాలం మే 3తో ముగిసింది. జీఎస్పీ కార్యక్రమం కింద ఆటో విడిభాగాలు, వస్త్రాల ముడిసరుకు వంటి సుమారు 2,000 వస్తువులు అమెరికాలో ఎలాంటి సుంకం లేకుండా ప్రవేశించేవి. 2017లో ఈ కార్యక్రమం ద్వారా భారత్ భారీగా లబ్ధి పొందింది. సుంకాలు లేకుండా అమెరికాలో 5.7 బిలియన్ డాలర్ల భారత ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి.