ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బౌలర్లు విఫలం

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బౌలర్లు విఫలం

ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. పేస్ బౌలర్ షమీ మాత్రమే మూడు వికెట్లతో పర్వాలేదనిపించారు. షమీ మినహా మిగతా బౌలర్లు ఎవరూ రాణించలేదు. మరో పేసర్ ఉమేశ్ యాదవ్‌, స్పిన్నర్ అశ్విన్‌లు తలో వికెట్‌ తీశారు. టీమిండియా బౌలర్లు తేలిపోవడంతో ఆస్ట్రేలియా ఎలెవన్‌ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. శుక్రవారం మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 24/0తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా ఎలెవన్‌ ఓపెనర్లు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో డీ ఆర్సీ షార్ట్‌ (74), మాక్స్‌ బ్రాంట్‌ (62)లు అర్ధ సెంచరీలు చేశారు. వీరి నిష్క్రమణ అనంతరం జేక్‌ కార్డర్‌ (38), కెప్టెన్‌ సామ్‌ వైట్‌మన్‌ (35)లు స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. చివరి సెషన్‌లో భారత బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. ఆట ముగిసే సమయానికి హరీ నీల్సన్‌ (56), ఆరోన్‌ హార్డీ (69) క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోర్ కు ఆస్ట్రేలియా ఎలెవన్‌ జట్టు మరో  రెండు పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. చివరిదైన నాలుగోరోజు అయినా భారత బౌలర్లు త్వరగా వికెట్లు తీస్తారో లేదో చూడాలి. అంతకుముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 358  పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.