'టాప్'లోనే టీమిండియా, కోహ్లీ

'టాప్'లోనే టీమిండియా, కోహ్లీ

బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టాప్ ప్లేస్ ను నిలుపుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించి 'మ్యాన్ అఫ్ ది సిరీస్'గా నిలిచిన విరాట్ 930 పాయింట్లతో నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో స్టీవ్‌ స్మిత్‌(929), విలియమ్సన్(847)‌, జోయ్‌ రూట్‌(835)లు తర్వాతి స్థానాలలో ఉన్నారు. ఇక టీమిండియా టెస్ట్ బ్యాట్స్‌మన్‌ చటేశ్వర పుజారా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరి టెస్టులో సెంచరీ చేసిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 19వ స్థానంకు చేరుకున్నాడు. టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకుని 111 స్థానంను దక్కించుకున్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా ఒక ర్యాంక్‌ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆల్ రౌండర్స్ జాబితాలో బంగ్లా ఆటగాడు షకీబ్ టాప్ లో ఉన్నాడు. రవీంద్ర జడేజా రెండు.. రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదవ స్థానంలో ఉన్నారు.

ఇంగ్లడ్‌పై 4-1తో టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్నప్పటికీ.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పది పాయింట్లు కోల్పోయిన టీమిండియా 115 పాయింట్లతో టాప్ లోనే కొనసాగుతోంది. అయితే టెస్టు సిరీస్‌లో ఓడిన నాలుగు మ్యాచ్‌లలో స్వల్ప తేడాతోనే ఓడిపోవడంతో టీమిండియా ఆగ్రస్థానాన్ని కాపాడుకోగలగింది. సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్‌ ఎనిమిది పాయింట్లు మెరుగుపర్చుకొని 105 పాయింట్లతో నాలుగో స్థానంలోకి దూసుకొచ్చింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా(106) రెండో స్ధానంలో ఉంది. ఆస్ట్రేలియా(106), ఇంగ్లాండ్(105), న్యూజిలాండ్‌(102), శ్రీలంక(97), పాకిస్తాన్‌(88)లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.