నేడే ఆస్ట్రేలియాతో తొలి టీ20

నేడే ఆస్ట్రేలియాతో తొలి టీ20

ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా సిద్ధమైంది. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఈ రోజు తొలి సమరం జరగనుంది. ప్రపంచకప్‌కు ముందు భారత్‌ ఆడే చివరి సిరీస్‌లు ఇవే కావడంతో జట్టు కూర్పుపై కసరత్తులు చేసే అవకాశం ఉంది. ఒకట్రెండు స్థానాల విషయంలో ఇప్పటికి సందేహాలు ఉన్నా.. ఈ సిరీస్‌లతో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బలంగానే భారత్:

కివీస్‌తో సిరీస్‌కు దూరమైన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో భారత జట్టు మరింత పటిష్టంగా మారింది. బ్యాటింగ్‌లో భారత్‌కు ఎలాంటి సమస్యలు లేవు. ఓపెనింగ్‌లో రోహిత్‌, ధావన్‌ల జోడీ మంచి భాగస్వామ్యం అందిస్తోంది. విరాట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జట్టును ఆదుకుంటాడు. ధోని, రిషభ్‌ పంత్, విజయ్‌ శంకర్, కృనాల్‌ పాండ్యాలు మిడిల్ ఆర్డర్ భారాన్ని మోయనున్నారు. వన్డేల్లో చోటు కోల్పోయిన దినేశ్‌ కార్తీక్‌ను టి20ల్లో ఆడిస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే ప్రపంచకప్‌ ఎంపికలో ఉన్న కేఎల్‌ రాహుల్‌ను ఆడిస్తే బాగుంటుందని మేనేజ్మెంట్ భావించొచ్చు. టీ20 సిరీస్‌కు పేసర్‌ భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చినా.. బుమ్రా, ఉమేశ్‌, కౌల్‌, చాహల్‌లతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగానే ఉంది. మార్కండేకు అవకాశం లభించడం కష్టమే.

కొత్త ఆటగాళ్లు రాణిస్తారా:

ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న మార్కస్‌ స్టొయినిస్‌.. బిగ్‌బాష్‌లో సత్తాచాటిన రిచర్డ్‌సన్‌, షార్ట్‌లపైనే ఆసీస్ నమ్మకం పెట్టుకుంది. ఈ కొత్త ఆటగాళ్లపైనే బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఫించ్, మ్యాక్స్‌వెల్, లిన్‌లు రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌లో కమిన్స్, కూల్టర్‌ నీల్, రిచర్డ్సన్‌లను నమ్ముకుంది. బిగ్‌బాష్‌లో సత్తాచాటిన షార్ట్‌, రిచర్డ్‌సన్‌లు ప్రధాన ఆటగాళ్లు. ఆస్ట్రేలియా గడ్డపై మంచి ప్రదర్శన చేసిన వీరు ఇక్కడ అదే ఆటను పునరావృతం చేస్తారని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ స్పిన్ పిచ్ లు కాబట్టి. మొత్తంగా ఆసీస్ శక్తికి మేర ఆడుతేనే విజయం సాధించొచ్చు.

తుది జట్లు (అంచనా):

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ధావన్, దినేశ్‌ కార్తీక్‌ /లోకేశ్‌ రాహుల్, ధోని, రిషభ్‌ పంత్, విజయ్‌ శంకర్, కృనాల్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్, యజువేంద్ర చహల్, బుమ్రా. 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), హ్యాండ్స్‌కోంబ్,  షార్ట్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, టర్నర్, క్యారీ, కూల్టర్‌ నీల్, కమిన్స్, జంపా, రిచర్డ్సన్‌.