భారత్ ఆలౌట్.. స్కోర్ 250

భారత్ ఆలౌట్.. స్కోర్ 250

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఆలౌట్ అయింది. 48.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ముందు 251 పరుగుల లక్ష్యంను ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన టీంఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (0) పరుగుల ఖాతా తెరవవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (21), అంబటి రాయుడు (18)లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి విజయ్ శంకర్ భారత స్కోరును పరుగులు పెట్టించాడు. దురదృష్టవశాత్తు శంకర్ (46) రనౌట్ అయ్యాడు.

అనంతరం జాదవ్ (11), ధోనీ (0)లు వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 171 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఓవైపు సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. కోహ్లీ ఒంటరి పోరాటం చేసాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 67 ప‌రుగులు జోడించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ (100; 107 బంతుల్లో 9×4) సెంచరీ సాధించాడు. ఈ దశలో ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో జడేజా (21) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే కోహ్లీ (116) భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. చివరలో కుల్దీప్ (3), బుమ్రా (0)లు అవుట్ అవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 4, జంపా రెండు వికెట్లు తీసుకున్నారు.