రెండో వన్డేకు రెడీ.. ఒత్తిడిలో టీమిండియా..!

రెండో వన్డేకు రెడీ.. ఒత్తిడిలో టీమిండియా..!

తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. రాజ్‌కోట్‌లో రెండో వన్డే జరగనుంది. మ్యాచ్‌ కోసం ఇప్పటికే రెండు టీమ్‌లు ప్రాక్టీస్‌ షురూ చేశాయి. సిరీస్‌ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. తొలి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచిన కోహ్లీసేన రెండో వన్డేలో రాణించి టైటిల్‌ పోరులో నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా అతిపెద్ద ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేను సునాయాసంగా సమర్పించుకుంది. అన్ని విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆస్ట్రేలియన్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో భారత్‌ 255 పరుగులకే ఆలౌటైంది. 

ఇక, అటు బౌలింగ్‌లోనూ టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది. వికెట్లు తీయడం..  ప్రత్యర్ధులను ఒత్తిడిలోకి నెట్టడంలో ఇండియన్‌ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన ఆసీస్.. కనీసం ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా విజయం సాధించింది. ఆసీస్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌-అరోన్‌ ఫించ్‌లు సెంచరీల మోత మోగించడంతో... 37.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్‌ చేసింది. రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో గెలవాలని టీమిండియా కసితో ఉంది. సిరీస్‌ సమం చేసి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సొంతగడ్డపై సిరీస్‌ను ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోకూడదని పట్టుదలతో ఉంది కోహ్లీసేన. బలమైన బ్యాటింగ్‌, బౌలింగ్ లైనప్‌ ఉన్న ఆసిస్‌ను దెబ్బతీసేందుకు..  పదునైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మరోవైపు.. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన కంగారూలు అంతే ఉత్సాహంతో రెండో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నారు. సెంచరీలు చేసిన ఫించ్‌, వార్నర్‌ అంతే ఫామ్‌తో కాచుకుని ఉన్నారు. సిరీస్‌లో ఇప్పటికే ఆసిస్‌ 1-0 ఆధిక్యంలో ఉంది.