సిరీస్ నీదా...? నాదా...? సై...

సిరీస్ నీదా...? నాదా...? సై...

మొదటి మ్యాచ్‌లో ఓడినా... రెండో వన్డేలో కంగారూలకు గట్టి షాక్‌ ఇచ్చింది టీమిండియా. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు రెఢీ అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ చిన్న స్వామి స్టేడియంలో కంగారూలను ఢీ కొట్టనుంది కోహ్లి సేన. ప్రస్తుతం చెరో గెలుపుతో ఇరు జట్లు సమంగా ఉండడంతో... ఇవాళ గెలిచిన టీమ్‌ ఖాతాలో సిరీస్‌ చేరుతుంది. రెండు జట్లు కూడా పోటా పోటీగా కనిపిస్తున్నాయి. చిన్న స్వామి స్టేడియం అంటేనే భారీ స్కోర్ల వేదిక. దీంతో హోరాహోరీ పోరాటం జరుగుతుందని భావిస్తున్నారు అభిమానులు. మరోవైపు ఈ స్టేడియంలో రోహిత్‌కు మంచి రికార్డు ఉంది. రెండో వన్డేలో అతనికి తగిలిన గాయం పెద్దదిగా కనిపించకపోయినా దానిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. మరో ఓపెనర్‌ ధావన్‌ గాయం గురించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే వీరిద్దరు బరిలోకి దిగవచ్చని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకంగా ఉంది. 

రాహుల్‌ అద్భుత ఫామ్‌ భారత్‌కు అదనపు బలం. వీరకి తోడు కెప్టెన్‌ కోహ్లీ బ్యాటింగ్‌ తోడైతే భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. అటు బుమ్రా తొలి స్పెల్‌ చూస్తే అతను మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అర్థమవుతోంది. స్పిన్నర్‌గా మళ్లీ కుల్దీప్‌కే అవకాశం ఖాయమయ్యే అవకాశముంది. రాజ్‌కోట్‌ వన్డేలో ఆ్రస్టేలియా స్వల్ప తేడాతోనే ఓడింది. కాబట్టి ఆ జట్టును తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం రావచ్చు. ముఖ్యంగా భారత పిచ్‌లపై ఐపీఎల్‌ ద్వారా రాటుదేలిపోయిన వార్నర్‌కు మరో భారీ ఇన్నింగ్స్‌ ఆడగల సత్తా ఉంది. కెప్టెన్ ఫించ్‌తో కలిసి శుభారంభం చేస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. టూర్‌లో చివరి మ్యాచ్‌ కాబట్టి రిచర్డ్సన్‌ స్థానంలో హాజల్‌వుడ్‌కు అవకాశం దక్కవచ్చు. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది. రెండు బలమైన జట్లే కాబట్టి సిరీస్‌ ఎవరికి దక్కుతుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.