కీలక పోరుకు టీమిండియా రెడీ..

కీలక పోరుకు టీమిండియా రెడీ..

ఐసీసీ వరల్డ్ కప్‌లో కీలక పోరుకు సిద్ధమైంది టీమిండియా... వరల్డ్ కప్‌ రేసులో ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు ఇవాళ ఆస్ట్రేలియాతో తలపడనుంది. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరుగుతున్న టోర్నీలో వరల్డ్ ఫేవరెట్ జట్లుగా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో తలపడనుంది టీమిండియా. ఈ రెండు జట్లనూ లీగ్‌ దశలో ఎదుర్కోబోతోంది. నాకౌట్‌కు  చేరాలన్నా.. నాకౌట్లో వీటిని ఎదుర్కోవాలన్నా.. లీగ్‌ దశలో వాటిని ఓడిస్తేనే టీమిండియా ఆత్మస్థైర్యం పెరుగుతుందంటున్నారు విశ్లేషకులు. సౌతాఫ్రికాను ఓడించి వరల్డ్ కప్‌ టోర్నీలో శుభారంభం చేసిన టీమిండియా.. ఇవాళ రెండో మ్యాచ్‌లో ఆసీస్‌తో ఢీకి రెడీ అయ్యింది. కెనింగ్టన్‌ ఓవల్‌ గ్రౌండ్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. 

ఇక రెండూ జట్లూ బలాబలాల్లో సమానంగా కనిపిస్తున్నాయి.. హోరాహోరీగా పోరు సాగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా.. ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతుంది. ఈ నెల 16న పాకిస్థాన్‌ను ఢీకొనబోతున్న భారత్‌.. ఆస్ట్రేలియాను ఓడించిన ఊపుతో ఆ మ్యాచ్‌కు వెళ్లాలనుకుంటోంది. బ్యాటింగ్‌లో కోహ్లి, రోహిత్‌, ధోని.. బౌలింగ్‌లో బుమ్రాపై భారత్‌ ఎన్నో ఆశలతో ఉంది. అయితే, ప్రపంచక్‌పలో టీమిండియా-ఆసీస్ 11 మ్యాచ్‌ల్లో తలపడితే... ఆసీస్ 8 విజయాలు తనఖాతాలో వేసుకోగా... భారత్ మూడు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. ఓవరాల్‌గా ఈ రెండు జట్ల మధ్య 136 మ్యాచ్‌లు  జరిగితే.. ఆసీస్‌ 77 మ్యాచ్‌ల్లో, టీమిండియా 49 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. గత ఏడాది కాలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ వల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కొంది కానీ.. ఆ జట్టు బౌలింగ్‌ బాగానే సాగుతోంది. స్టార్క్‌, కమిన్స్‌ లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్‌బౌలర్లు ఆ జట్టు సొంతం. వేగం, కచ్చితత్వం, వైవిధ్యం.. ఎందులో అయినా వీళ్లిద్దరికీ తిరుగులేదు. ప్రపంచకప్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ వీళ్లిద్దరూ సత్తా చాటారు. ఓవల్‌ పిచ్‌ ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఈ జోడీని ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలే. 

భారత జట్టు అంచనా: శిఖర్ ధవన్‌, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, ఎంఎస్ ధోనీ, జాదవ్‌/విజయ్‌ శంకర్‌, హార్దిక్‌, భువనేశ్వర్‌/షమి, కుల్దీప్‌, చాహల్‌, బుమ్రా.
ఆస్ట్రేలియా జట్టు అంచనా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, ఖవాజా, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌, క్యారీ, కల్టర్‌ నైల్‌, కమిన్స్‌, స్టార్క్‌, జంపా.