అభిమానిని పరిగెత్తించిన ధోనీ

అభిమానిని పరిగెత్తించిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఆరంగేట్రం నుంచి  ఇప్పటివరకు తన బ్యాటింగ్, కీపింగ్ లతో అభిమానులను అలరిస్తున్నాడు. కూల్ కెప్టెన్ గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి అభిమానుల గుండెల్లో నిలిచాడు. దీంతో ధోనీ అభిమానులు అతన్ని కలవాలని చూస్తుంటారు. తన అభిమాన క్రికెటర్ ధోనీని కలవాలని మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఓ అభిమాని సాహసం చేశాడు.

భారత్‌ బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత ఫీల్డింగ్‌ చేయడానికి జట్టు సభ్యులు మైదానంలోకి వెళుతున్న సమయంలో.. ధోనీని కలవడానికి ఏకంగా భద్రతా వలయాలన్ని దాటుకోని ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. ధోనీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు అభిమాని యత్నించాడు. అయితే అభిమాని నుంచి తప్పించుకునేందుకు ధోనీ మైదానంలో పరుగులు తీశాడు. అయినా ఆ అభిమాని వదలకుండా ధోనీ వెంబడి పరుగెత్తాడు. అభిమాని వదలకపోవడంతో.. చివరకు వికెట్ల వద్ద నిలబడిపోయాడు. ధోనీ తన అభిమానికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. అనంతరం అభిమాని ధోనీని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అయితే సరదా కోసం ధోనీ తన అభిమానిని పరిగెత్తించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.