ఢిల్లీ వేదికగా ధనాధన్.. ఒకే దెబ్బతో 2 విక్టరీలు కొట్టేదెవరు..?

ఢిల్లీ వేదికగా ధనాధన్.. ఒకే దెబ్బతో 2 విక్టరీలు కొట్టేదెవరు..?

కాస్త విరామం తర్వాత భారత క్రికెట్‌ అభిమానుల్ని అలరించేందుకు ధనాధన్‌ క్రికెట్‌కు సిద్ధమైంది.  కుర్రాళ్లతో కళకళలాడుతున్న భారత జట్టు రోహిత్‌ కెప్టెన్సీలో సమరోత్సాహంతో మ్యాచ్‌కు సై అంటోంది. ఈ సిరీస్‌లో అందరూ రెండూ విషయాలు మీద ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నారు. ఒకటి బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌పై నిషేధం.. రెండోది అరుణ్‌ జైట్లీ  మైదానాన్ని కమ్మేసిన కాలుష్యం. కొన్నేళ్లుగా బంగ్లా ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన షకిబ్‌పై వేటు ఆ జట్టుకు పెద్ద షాకే. షకిబ్‌ లేకున్నా బంగ్లా ప్రమాదకర జట్టే అయినప్పటికీ.. ఈ అనూహ్య పరిణామం నుంచి ఆ జట్టు ఏమేర కోలుకుని భారత్‌ను దాని సొంతగడ్డపై ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం. 

పొట్టి ఫార్మాట్‌లో ప్రత్యర్థి బంగ్లాదేశ్ అంటే చాలు.. టోర్నీ ఏదైనా, వేదిక ఎక్కడైనా.. టీమిండియాకు పూనకం వచ్చేస్తుంది. అందుకు తగ్గట్లే ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఎనిమిది టీ20 మ్యాచ్‌లు జరగగా.. ఎనిమిదింటా భారత్‌నే విజయం వరించింది. అప్పుడెప్పుడో ప్రపంచకప్ నుంచి మొదలు పెడితే.. నిన్నమొన్నటి నిదాహస్ ట్రోఫీ వరకు భారత్‌పై గెలువాలని విశ్వప్రయత్నాలు చేసిన బంగ్లాకు నిరాశే మిగిలింది. అచ్చొచ్చిన ఢిల్లీ పిచ్‌పై అదరగొట్టాలని రోహిత్ సేన చూస్తుంటే..  నానా ఇబ్బందులు పడుతున్న బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రత్యర్థితో పాటు కాలుష్యంపై కూడా పైచేయి సాధించిన వారిదే విజయం అనడంలో సందేహం లేదు.

పెద్ద జట్లను ఓడించడాన్ని అలవాటుగా మార్చుకున్న బంగ్లాదేశ్‌ను టీమిండియా తేలిగ్గా తీసుకునే సాహసం చేయదు. పైగా టీ20ల్లో ఎవరు ఎవరి మీదైనా గెలవొచ్చు. నిషేధం కారణంగా షకిబ్‌, వ్యక్తిగత కారణాలతో తమీమ్‌ దూరమైనప్పటికీ.. కెప్టెన్‌ మహ్మదుల్లాతో పాటు ముష్ఫికర్‌ రహీమ్‌, సౌమ్య సర్కార్‌, లిటన్‌ దాస్‌, ముస్తాఫిజుర్‌ లాంటి ప్రతిభావంతులతో ఆ జట్టు ప్రమాదకరంగానే కనిపిస్తోంది. కష్టకాలంలో జట్టు పగ్గాలందుకున్న మహ్మదుల్లా కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో జట్టునెలా నడిపిస్తాడో చూడాలి. ముస్తాఫిజుర్‌తో భారత బ్యాట్స్‌మెన్‌కు చిక్కులు తప్పకపోవచ్చు. అతణ్ని ఆచితూచి ఆడాల్సిందే. అరుణ్‌ జైట్లీ స్టేడియం పిచ్‌ స్వతహాగా స్పిన్నర్లకు అనుకూలం. అయితే ప్రస్తుతం మంచు ప్రభావం కారణంగా రాత్రి పూట స్పిన్నర్లకు బంతిపై పట్టు చిక్కడం ఇబ్బందవుతుంది. అయినప్పటికీ స్పిన్నర్లకే రెండు జట్లూ పెద్ద పీట వేసే  అవకాశముంది. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగితే బ్యాట్స్‌మెన్‌ ధారాళంగా పరుగులు చేయొచ్చు.