బంగ్లా vs భారత్...టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లా

బంగ్లా vs భారత్...టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లా


బంగ్లాతో పొట్టి సిరీస్‌ను టీమిండియా కొట్టేసింది. ఇప్పుడు టెస్ట్‌ వంతు వచ్చింది. ధనాధన్‌ క్రికెట్‌లో టీమిండియాకు గట్టిపోటీనే ఇచ్చిన బంగ్లాకు టెస్ట్‌ల్లో అసలు సిసలు పరీక్ష ఎదురు కానుంది. టీ20లో ఊహించిన దానికంటే గట్టిగానే పోరాడిన బంగ్లా పులులకు రెండు టెస్టుల సిరీస్‌ పెద్ద పరీక్ష పెట్టనుంది. ముఖ్యంగా భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడం బంగ్లాకు సవాలే. బుమ్రా లేకపోయినా మహ్మద్‌ షమి, ఇషాంత్‌శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లతో భారత పేస్‌ విభాగం బలంగా ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అద్భుత బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీ రోల్‌ ప్లే చేసిన పేసర్లు మరోసారి పంజా విసిరేందుకు రెడీ అయ్యారు.

భారత్‌తో ఇప్పటిదాకా ఆరు టెస్టు సిరీస్‌లలో తలపడ్డ బంగ్లాదేశ్‌ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. సిరీస్‌ సంగతి పక్కనపెడితే ఒక్క మ్యాచ్‌లోనూ బంగ్లా నెగ్గలేకపోయింది. 2000లో తొలిసారి ఈ రెండు జట్లు సిరీస్‌ ఆడగా భారత్‌ 1-0తో గెలిచింది. 2015లో ఏకైక టెస్టు సిరీస్‌ను  0-0తో డ్రా చేసుకోవడం ఒక్కటే ఇప్పటిదాకా ఆ జట్టు ఉత్తమ ప్రదర్శన. చివరిగా 2017లో హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో భారత్‌ నెగ్గింది. దీంతో  రెండు మ్యాచ్‌ల పోరుకు సిద్ధమైన బంగ్లా.. సిరీస్‌ను డ్రా చేసుకున్నా గొప్ప విషయమే. కానీ ఇటీవల టెస్టుల్లో భారత జోరు చూస్తుంటే బంగ్లా ఎదురు నిలవడం కష్టంగానే కనిపిస్తోంది. టాస్‌ గెలిచిన బంగ్లా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పట్టికే టీ20 సిరీస్‌ గెలిచిన భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై కన్నేసింది. పొట్టి సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టు పగ్గాలు అందుకున్నాడు.