మ్యాచ్ మనదే.. సిరీస్ మనకే..

మ్యాచ్ మనదే.. సిరీస్ మనకే..

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. బంగ్లాపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సొంత గడ్డపై భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఝలక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ కూడా కొద్ది సేపటికే వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కేఎల్‌ రాహుల్‌  బాధ్యతాయుతంగా ఆడగా.. అయ్యర్‌ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరూ హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. శ్రేయస్‌ అయ్యర్‌ 33 బంతుల్లో 62 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో మనీశ్‌ పాండే బ్యాట్‌ ఝులిపించడంతో బంగ్లాకు 175పరుగుల టార్గెట్‌ను సెట్‌ చేసింది టీమిండియా. విమర్శలు ఎదుర్కోంటున్న యంగ్‌ కీపర్‌ పంత్‌ ఈ మ్యాచ్‌లోనూ ఫెయిలయ్యాడు.

175 పరుగుల టార్గెట్‌ బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను దీపక్‌ చాహర్‌ ఆదిలోనే దెబ్బతీశాడు. మూడో ఓవర్‌లో లిటన్ దాస్ , సౌమ్య సర్కార్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మిథున్‌తో కలిసి మహ్మద్‌ నయీమ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చక్కని షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. వారి జోరు చూస్తే బంగ్లా విజయం ఖాయమన్నట్లే కనిపించింది. కానీ 13వ ఓవర్లో మిథున్‌ను దీపక్‌ ఔట్‌ చేయడంతో 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత భారత్‌దే పైచేయి. శివమ్‌ దూబే మూడు కీలక వికెట్లు పడగొట్టి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చివర్లో షఫియుల్‌, ముస్తాఫిజుర్‌, అమినుల్‌ ఇస్లామ్‌ను వరుస బంతుల్లో ఔట్‌చేసి దీపక్ చాహర్‌ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో బంగ్లా పోరాటం 19.2 ఓవర్లలోనే 144 పరుగుల వద్దే ముగిసింది. ఈ మ్యాచ్‌ విజయంతో 2-1 తో సిరీస్‌ను నెగ్గింది రోహిత్‌ సేన. హ్యాట్రిక్‌తో పాటు ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించిన దీపక్‌ చాహర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కింది.