2020లో విదేశీ గడ్డపై తొలి టీ-20కి రెడీ

2020లో విదేశీ గడ్డపై తొలి టీ-20కి రెడీ

ఈఏడాది టీమిండియా తొలి విదేశీ పర్యటన మొదలైంది. పూర్తి స్థాయి సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌లో అడుగుపెట్టింది. ఈ టూర్‌లో మొత్తం ఐదు టీ ట్వంటీలు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. శుక్రవారం తొలి టీట్వంటీ ఆడనుంది. గతేడాది 4-1తో వన్డే సిరీస్‌ను గెలుచుకన్న కోహ్లీసేన... టీ-20సిరీస్‌లో మాత్రం రాణించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సిరీస్‌ గెలువాలనే పట్టుదలతో ఉంది. ఇక ఐదేళ్ల తర్వాత కివీస్‌లో టెస్టు సిరీస్‌ ఆడబోతోంది. 2018 ఆసీస్‌ టూర్‌ తర్వాత మూడు ఫార్మాట్లలో విదేశీ గడ్డపై టీమిండియా ఆడటం ఇదే తొలిసారి. దీంతో కివీస్‌ పిచ్‌లపై మనవారి ప్రదర్శన ఎలా ఉండబోతున్నది ఇంట్రెస్టుగా మారింది.

వన్డేల్లో బెట్టర్ రికార్డు ఉన్నా... టీ ట్వంటీల్లో మాత్రం కీవిస్‌దే పైచేయిగా ఉంది. అయితే విపరీత గాలులతో కూడిన చల్లటి వాతావరణానికి అలవాటు పడేందుకు కోహ్లీ సేనకు కొద్ది సమయం అవసరం కూడా.  కివీస్ టూర్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది ఆసిస్‌ వేదికగా టీ-20 ప్రపంచకప్‌ జరగనుండటంతో...ఈ సీరిస్‌ ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. వరల్డ్‌కప్ ఆడే సమయానికి అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులపై అవగాహన వచ్చే అవకాశం ఉంది. కోహ్లీ సారథ్యంలో టీమిండియా యువ ఆటగాళ్లతో బలంగానే ఉంది. ప్రత్యర్థి టీమ్‌ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.