వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి

వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి

వరల్డ్ కప్ లో భాగంగా ఓవల్ వేదికగా న్యూజిలాండ్ జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి చెందింది. బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తి విఫలం కావడంతో న్యూజిలాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 180 పరుగుల టార్గెట్ ను 37.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేన్‌ విలియమ్సన్‌ (67; 87 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్స్), రాస్‌టేలర్‌ (70; 73 బంతుల్లో 8ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించి జట్టుకు విజయం అందించారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 39.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. కివీస్ పేస్ అటాక్ కు కోహ్లీ సేన పెవిలియన్ బాట పట్టింది. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య(30; 37 బంతుల్లో 6ఫోర్లు), రవీంద్ర జడేజా (54; 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) ఆదుకోవడంతో ఆ మాత్రమైనా స్కోర్‌ సాధించింది. మిగతా బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ(18), ధోనీ(17), కుల్‌దీప్‌ యాదవ్‌(19) కుదురుకొనేందుకు ప్రయత్నించినా న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ట్రెంట్‌ బౌల్ట్(4/33)‌, నీషమ్‌(3/26) ధాటికి.. 39.2 ఓవర్లలో 179 పరుగులకే టీమిండియా కుప్పకూలింది.