ఫైనల్‌కు దూసుకెళ్లేదెవరు..?

ఫైనల్‌కు దూసుకెళ్లేదెవరు..?

మెగా సమరానికి ఆఖరి వారం.. ప్రపంచకప్‌లో చివరి ఘట్టం.. ప్రపంచకప్ లీగ్ దశను విజయవంతంగా ముగించిన టీమిండియా మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొనేందుకు సిద్ధమైంది. మాంచెస్టర్‌ వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత్-కివీస్ మధ్య ఇదే తొలిపోరు కానుంది. లీగ్ దశలో ఇరుజట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికే.. అన్ని విభాగాల్లో రెండు జట్లు పటిష్టంగా ఉన్నాయి. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగిన టీమిండియా ప్రస్థానం సెమీ ఫైనల్ వరకు విజయవంతంగానే సాగింది. హోంటీమ్ ఇంగ్లండ్ టీమ్‌లో పరాజయం.. వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దు కావడం మినహాయిస్తే మిగతా ఏడు మ్యాచ్‌ల్లోనూ భారత్ అదరగొట్టింది. రోహిత్ శర్మ ఐదు సెంచరీలతో కెరీర్‌లోనే అద్భుతమైన ఫామ్‌లో ఉండడం టీమిండియాకు ప్లస్ పాయింట్ అయ్యింది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో ఫామ్‌లోకి రావడం కెప్టెన్ కోహ్లీ నిలకడగా ఆడడం.. మొత్తం మీద టీమిండియా టాప్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే, ఇప్పటి వరకు టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు సరైన పరీక్ష ఎదురుకాలేదు. ధోనీ పరవాలేదనిపిస్తున్నా.. వేగంగా ఆడలేకపోతున్నాడు. దీంతో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో టాప్ ఆర్డరే కీలకం కానుంది.

భారత్ భారీ స్కోర్ చేయాలన్నా.. టార్గెట్ ఛేదన సాపీగా సాగిపోవాలన్నా రోహిత్, రాహుల్, కోహ్లీలో ఒకరు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ఒకవేళ వీరు విఫలమైతే మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ధోనీ బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది. బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, షమీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. చాహల్, భువనేశ్వర్ కుమార్ పరవాలేదనిపిస్తున్నారు. వీరంతా చెలరేగి ఆడితే కోహ్లీసేనకు ఇక తిరుగుండదు.. అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతోఉన్న న్యూజిలాండ్‌కు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేసే అలవాటుంది. ఆరు ప్రపంచకప్‌ల్లో సెమీస్‌లోనే నిష్క్రమించిన కివీస్.. 2015 ప్రపంచకప్‌లో ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి.. తుదిమెట్టుపై చతికిలపడింది. ఈ ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టింది. వరుసగా ఆ జట్టుకు ఆరు మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురుకాలేదు. అయితే, చివరి మూడు మ్యాచ్‌ల్లో కివీస్ జట్టుకు ఓటమి ఎదురైంది.

భారత్‌ జట్టు అంచనా: రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌, ఎంఎస్ ధోని, పాండ్య, కుల్‌దీప్‌, చాహల్‌, జడేజా/భువనేశ్వర్‌, బుమ్రా, షమి 
న్యూజిలాండ్‌ జట్టు అంచనా:గప్తిల్‌, మన్రో, విలియమ్సన్‌, టేలర్‌, లేథమ్‌, నీషమ్‌, గ్రాండ్‌హోమ్‌, శాంట్నర్‌, హెన్రీ, బౌల్ట్‌, ఫెర్గూసన్‌